ఖైరతాబాద్, అక్టోబర్ 23: బీసీ బిల్లును ఆమోదించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. బిల్లుపై గవర్నర్ వైఖరిని నిరసిస్తూ గురువారం రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో, రాజ్‌భవన్ ఎదుట బైఠాయించి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో బీసీ పొలిటికల్ జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేంధర్ గౌడ్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల బిల్లును తన వద్దే ఉంచుకొని సంతకం చేయకుండా గవర్నర్ ఆలస్యం చేయడం సరికాదని మండిపడ్డారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్‌గా పనిచేస్తూ బీసీల హక్కులను అడ్డుకోవడం సరికాదని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బిల్లుపై తక్షణమే గవర్నర్ సంతకం చేసి కేంద్ర ప్రభుతానికి పంపించాలని, ఆ తర్వాత రాజ్యంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జీ కిరణ్ కుమార్, బాలరాజుగౌడ్, గణేశ్‌గౌడ్, అయిలి వెంకన్న, దుర్గయ్య, నగేశ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.