Prashanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరుగుతోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించిన చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. ప్రభుత్వం చెబుతున్నట్టుగా రాష్ట్రంలో ఎక్కడా పూర్తి రుణమాఫీ కాలేదని అన్నారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ తాము పూర్తిస్థాయిలో రుణమాఫీ చేశామని, లెక్కలతో సహా వెల్లడిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం అంశాన్ని భట్టి ప్రస్తావించారు. బాల్కొండలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ అయ్యిందన్నారు. దీనిపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోకవర్గంలో మొత్తం 51 వేల మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉంటే కేవలం 20 వేల మందికే రుణాలు మాఫీ చేశారని చెప్పారు. ఇంకా 31 వేల మందికి రుణమాఫీ కాలేదని అన్నారు. అంతేగాక బీఆర్ఎస్ హయాంలో రెండు విడతల్లో చేసిన రుణమాఫీ కంటే ఇప్పటి కాంగ్రెస్ సర్కారు చేసిన రుణమాఫీ చాలా తక్కువగా ఉందని విమర్శించారు. నేను చెప్పింది అవాస్తవమైతే చర్చకు ఇచ్చే సమాధానంలో ఆ విషయాన్ని ప్రస్తావించాలని అన్నారు.
రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడంతో కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. మీ హయాంలో ఏం చేశారని ప్రశ్నంచారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ తీరును వేముల ఎద్దేవా చేశారు. మేం ఏం చేశామనేది గతమని, మీరేం చేస్తున్నారో చెబుతుంటే మా మీద ఏడవడం దేనికని ప్రశ్నించారు. మీరు అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తయ్యిందని, 17 నెలలుగా మా మీద ఏడుస్తూనే ఉన్నారని, ఇంకెన్నాళ్లు ఏడుస్తారని..? వ్యంగ్యంగా ప్రశ్నించారు.