హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టంలోరాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఒకట్రెండు ప్రదేశాల్లో భారీ వర్షాలు, రేపు, ఎల్లుండి చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. రాగల ఐదు రోజుల్లో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తన ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.