Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసైనికులు, సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్‌డే అంటే అభిమానులకు ఓ పండగనే చెప్పాలి. ప్రతి ఏడాది ఆయన ఇంటి వద్దకు, కార్యాలయానికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకుని తమ అభిమాన నటుడికి, నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. జనసేన పార్టీ తరఫున కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. అభిమానులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్సలో భాగంగా వారం రోజుల క్రితమే ఆయన కేరళకు వెళ్లినట్లు సమాచారం. త్రిస్సూర్ సమీపంలోని ఓ ఆయుర్వేద వైద్యశాలలో పవన్‌కు ప్రత్యేక థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.సుమారు నెల రోజుల పాటు ఈ చికిత్స కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు నాడు కూడా కేరళలోని ఆయుర్వేద వైద్యశాలలోనే ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కారణంగానే ఈసారి ఆయన అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ప్రత్యక్షంగా అందుబాటులో లేకపోయారు.
పవన్ కళ్యాణ్ కేరళలో ఉండటంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో జరగాల్సిన పలు కార్యక్రమాలను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా జరిగే కార్యక్రమాలకు జనసేన నాయకులు అధ్యక్షత వహించనున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ కేరళలో ఉన్నారనే విషయం తెలియడంతో అక్కడి తెలుగు ప్రజలు, పవన్ అభిమానులు ప్రత్యేకంగా ఆయన పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు.మరోవైపు కేరళలోని NIT కాలికట్లో సుమారు 300 మంది విద్యార్థులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్‌పై తమకున్న అభిమానాన్ని విద్యార్థులు ఈ సందర్భంగా చాటుకున్నారు.