Ram Charan | ‘పెద్ది’ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సుకుమార్ దర్శకత్వంలో ‘RC 17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమాను గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పటికీ.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఇటీవల రామ్ చరణ్ చేతికి సర్జరీ జరగడంతో ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే తదుపరి సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇంతలోనే చరణ్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గుజరాత్లో ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ అనే సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. కేవలం సుమారు రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ గుజరాతీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన తొలి గుజరాతీ చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. చిన్న బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇంతటి భారీ విజయాన్ని సాధించడంతో ఇతర భాషల్లోనూ దీనిపై ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఈ సూపర్‌హిట్ గుజరాతీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్‌లో ప్రధాన పాత్ర కోసం రామ్ చరణ్‌తో చర్చలు జరుగుతున్నాయనే ప్రచారం ప్రస్తుతం బీటౌన్ వర్గాల్లో వినిపిస్తోంది.
‘లాలో: కృష్ణ సదా సహాయతే’ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్రకు కీలక ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు రీమేక్‌లో ఆ పాత్రను రామ్ చరణ్‌తో చేయిస్తే సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ తెలుగు రీమేక్‌కు దర్శకుడిగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ పేరు వినిపిస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’కు కథా ఆలోచన అందించిన కార్తిక్ సుబ్బరాజ్.. ఈ రీమేక్‌ను తెరకెక్కించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కేవలం చర్చల దశలోనే ఉందని సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? కార్తిక్ సుబ్బరాజ్ నిజంగానే దర్శకత్వం వహించనున్నారా? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ‘గోపాల గోపాల’ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడ్రన్ శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో రామ్ చరణ్ కూడా శ్రీకృష్ణుడి పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.