హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు మెరుపులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.