హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పెదవాగుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఎడవల్లి వాగు పొంగడంతో మహదేవపూర్-కాళేశ్వరం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మహదేవపూర్ మండలంచంద్రపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ములుగు జిల్లా బొగత జలపాతానికి వరద తాకిడి పెరిగింది. సందర్శకుల రాకపోకలను నిలిపివేశారు. సమ్మక- సాగర్ బ్యారేజ్ దగ్గర గోదావరి వరద పెరిగింది. 52 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగజ్‌నగర్‌లో అత్యధికంగా 15.39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు పెదవాగుకు వరద పోటెత్తడంపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీ, నీటిపారుదల అధికారులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. సహాయ కార్యక్రమాల్లో పోలీసులు పాల్గొనాలని డీజీపీ జితేందర్ సూచించారు.
వాయుగుండంగా అల్పపీడనం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం తెల్లవారుజామున ఒడిశా తీరాన్ని దాటే అవకాశముందని తెలిపింది. దీంతో రెండు, మూడు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది. ఈ మేరకు రెడ్, ఎల్లో అలర్టులను జారీ చేసింది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది.