హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల రక్షణ, రైల్వే ఆస్తులను కాపాడటంలో రైల్వే ఆర్పీఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. 2024లో ఆర్పీఎఫ్ సాధించిన విజయాల గురించి ఆయన వివరించారు.
రైల్వే ఆస్తుల సంరక్షణలో 367 కేసుల్లో 674 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.83.31 లక్షల ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జీఆర్పీ సహాయంతో 460 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.3.17 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
వివిధ కారణాలతో తప్పిపోయిన 1,385 మంది పిల్లలను గుర్తించి, వారిని రక్షించారని, 264 మానవ అక్రమ రవాణాదారుల నుంచి 791 మంది బాల బాలికలను రక్షించారని వివరించారు. డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించిన 111 కేసుల్లో 127 మందిని అరెస్టు చేసి, రూ.5 కోట్ల విలువైన 2,311.31 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.