హైదరాబాద్ : రైల్వే బడ్జెట్‌ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్‌తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం సికింద్రాబాద్‌లోని రైల్ కళారంగ్‌లో జరిగిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ గతంలో మాదిరిగా రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగానే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని, సాధారణ బడ్జెట్‌తో కలపడంతో విషయం అంతా అగమ్యగోచరంగా మారుతోందన్నారు. రైల్వే బడ్జెట్‌ను ప్రత్యేకంగానే పార్లమెంటులో ప్రవేపెట్టే విధానాన్ని పునరుద్ధరించాలని, రైల్వేశాఖను ప్రైవేటు పరం చేసే వెంటనే ఉపసంహరించుకోవాలని వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రైల్వేశాఖను ప్రైవేటుపరం చేయడంతో రిజర్వేషన్ సౌకర్యాలు కోల్పోయి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు తీరని అన్యాయం జరుగుతోందని వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియన్ రైల్వే శాఖ రవాణా, ఉద్యోగ అవకాశాలు కల్పించే రైల్ గ్రిడ్ ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా తర్వాత నాల్గో అతిపెద్ద సంస్థ అని పేర్కొన్నారు. ఇండియన్ రైల్వే 1,23,542 కిలోమీటర్ల ట్రాక్‌లు, 7,300 రైల్వేస్టేషన్లు ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 8.1 బిలియన్ ప్రయాణీకులను, 1.23 బిలియన్ సరుకులను గమ్యాన్ని చేర్చిన ఘనత ఇండియన్ రైల్వే శాఖకు దక్కుతుందన్నారు.
సుమారు 1.3 బిలియన్ ఉద్యోగులు కలిగిన శాఖ అని వివరించారు. అంతటి ఘన చరిత్ర కలిచిన రైల్వే శాఖను ప్రైవేటుపరం చేయడం తగదని, రైల్వేను ప్రైవేటుపరం చేసే ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి, రైల్వే మాజ్దూర్ యూనియన్ జాతీయ కార్యదర్శి శంకర్ రావు, రైల్వే రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ సిన్హా, నాయకులు ఉన్నీ, సుంకప్ప, చంద్ర మోహియార్, యుగంధర్, యాదవ రెడ్డి, మోహన్ బల్లా పాల్గొన్నారు.