రాయికల్, జూన్ 3 : భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసి, మధ్యవర్తి ద్వారా రూ.10 వేల లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాయికల్ మండలం సింగారావుపేటకు చెందదిన రవికి గ్రామ శివారులోని సర్వే నంబర్ 991/5/1/2లో 1.025 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనిని రవి అవసరం కోసం ఇతరులకు విక్రయించాడు. ఆ భూమి రిజిస్ట్రేషన్ కోసం రాయికల్ ఇన్చార్జి తహసీల్దార్‌ను కలిశాడు.
సదరు భూమిలో నుంచి కొంత భాగంలో కెనాల్ పోతుందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని, రూ.15 వేలు ఇస్తేనే చేస్తానని ఇన్చార్జి తహసీల్దార్ విక్రయదారుడికి చెప్పడంతో అతడు ప్రైవేటు డాక్యుమెంట్ రైటర్ ముజాఫర్‌ను కలిశాడు. అనంతరం ఏసీబీ అధికారులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని తెలిపాడు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రసాయనాలు పూసిన డబ్బులను రవికి అందచేయగా, రూ.10 వేలను మధ్యవర్తి డాక్యుమెంట్ రైటర్‌ను కలిసి అడ్వాన్స్‌గా రూ.10 వేలు ఇస్తున్నా, పని పూర్తయిన తర్వాత మిగతా రూ.5 వేలు ఇస్తానని చెప్పాడు. మధ్యవర్తి ముజాఫర్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌కు లంచం డబ్బులు అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్, మధ్యవర్తి ముజాఫర్‌ను అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.