Gautam Adani | హైదరాబాద్, నవంబర్ 21(నమస్తే తెలంగాణ) : అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి, అదానీ బంధంపై అనుమానాలు రేకెత్తిస్తున్నది. వీరి బంధంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. సొంత పార్టీ కాంగ్రెస్‌లోనూ ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. అక్కడే అంత ముట్టినప్పుడు, ఇక్కడ ఎంత ‘ముట్టాయో’నంటూ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఒప్పందాలు చేసుకున్న ఆయా రాష్ర్టాల్లో ప్రభుత్వ నేతలకు లంచాలు ఇస్తున్న అదానీ తెలంగాణలో మాత్రం ఎందుకు ఇవ్వకుండా ఉంటారనే చర్చ జరుగుతున్నది. రేవంత్, అదానీ బంధం ‘పవిత్ర బంధం’ కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో సోలార్ విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందంలో పలు రాష్ర్టాల ప్రభుత్వాధినేతలకు అదానీ గ్రూప్ రూ. 2029 కోట్ల లంచాలు ఇచ్చినట్టు అరోపణలు ఉన్నాయి. దీనిపై అమెరికాలోని న్యూయార్క్‌లో అదానీపై అవినీతి కేసు నమోదైంది.
రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఇవన్నీ డ్రామాలేనని తేలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదానీతో బంధం కోసం రేవంత్‌రెడ్డి వెంపర్లాడారనే విమర్శలున్నాయి. ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారంలో ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రేవంత్‌రెడ్డి, అదానీ మధ్య బంధం ఏర్పడిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి ఇద్దరూ పరస్పర భిన్నంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. అదానీని రాహుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఆయనతో బంధం పెంచుకోవడానికి ఇష్టపడటం విమర్శలకు తావిస్తున్నది. మోదీ, అదానీ ఒకటేనని, ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నారంటూ రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం రాష్ట్రంలో అందుకు పూర్తి భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నారు. ఆయనతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు.
గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీతో సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు భేటీ అయ్యారు. కొన్నిసార్లు అధికారికంగా భేటీ కాగా మరికొన్ని సార్లు రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. పైకి ప్రభుత్వ ఒప్పందాలని చెప్తూనే లోలోపల ఏదో గూడుపుఠానీ జరిగిందనే ఆరోపణలున్నాయి.. రేవంత్‌రెడ్డి, అదానీ ఈ ఏడాది జనవరి 23న దావోస్‌లో భేటీ కాగా, మరోసారి అక్టోబర్ 18న హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అదానీ కుమారుడు కరణ్ అదానీ జనవరి 3న సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వంలో నంబర్ 2గా చెప్పుకొంటున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటు అదానీ, అటు కరణ్ అదానీతో రహస్యంగా భేటీ అయినట్టు వార్తలొచ్చాయి. అక్టోబర్ 3న అదానీతో పొంగులేటి భేటీ అయినట్టుగా తెలిసింది. అంతకు ముందు తన ఇంట్లోనే కరణ్‌తో రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది.
అదానీ కంపెనీలపై దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ఈ కంపెనీ తీవ్ర ఆర్థిక అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం అనేకసార్లు అదానీపై ఆరోపణలు గుప్పించారు. ప్రపంచం మొత్తం అదానీని వ్యతిరేకిస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం అదానీని అక్కున చేర్చుకుని వరుస ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 23న దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో అదానీ కంపెనీలతో రూ. 12,400 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ కంపెనీ రూ. 100 కోట్లు విరాళం ఇచ్చింది. అదానీ స్వయంగా హైదరాబాద్ వచ్చి సచివాలయంలో రేవంత్‌రెడ్డికి చెక్ అందజేశారు. భువనగిరి జిల్లా రామన్నపేటలో అదానీ సంస్థ నిర్మించబోయే అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తున్నది. పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు, రెగ్యులేషన్ బాధ్యతను కూడా అదానీ కంపెనీకి ప్రభుత్వం అప్పగించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.
అమెరికాలో అదానీపై అవినీతి కేసు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోలార్ విద్యుత్తు కొనుగోలులో లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగిలిన ఒప్పందాల్లోనూ ఇదే రకమైన అవినీతి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్న కంపెనీని ఆహ్వానించి మరీ ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం అదానీ కంపెనీలతో ఒప్పందాలను సమర్థించుకోవడం గమనార్హం. బరాబర్ ఒప్పందాలు చేసుకుంటామని, పెట్టుబడులు పెట్టిస్తామని కుండబద్దలు కొట్టడం గమనార్హం.
అదానీపై అమెరికాలో అవినీతి కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఆది నుంచి తాము చెప్తున్నదే ఇప్పుడు నిజమవుతున్నదని పేర్కొన్నారు. దేశంలో అదానీతో అంటకాగిన ప్రతి ఒక్కరిపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. వారు ఏ పార్టీ వారైనా విచారణ జరిపించాల్సిందేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వేళ్లన్నీ ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డిని చూపుతున్నాయి. రాహుల్ పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో అదానీని వ్యతిరేకిస్తుంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ ఇందుకు విరుద్ధంగా అదానీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడంపై జాతీయ నాయకత్వం గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అదానీపై కేసుతో ఆయనతో కలిసున్న అందరిపైనా కేసు పెట్టాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.
అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో దేశంలో ఆయనతో అంటకాగిన ప్రతి ఒక్కరిపైనా కేసు పెట్టాలంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు రేవంత్ గురించి కాదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. దేశ సంపద, వనరులను అదానీకి అప్పగిస్తున్నారంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై భట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీ విషయంలో రాహుల్‌గాంధీ స్టాండ్‌కు కట్టుబడి ఉంటామని, ఆయన ఆలోచనలను సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రివర్గం పాటిస్తుందని స్పష్టం చేశారు. అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో, ఆయనతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో స్పందించిన భట్టి.. అదానీ విషయంలో మోదీని విమర్శిస్తూనే.. తెలంగాణలో అదానీ పెట్టుబడులను మాత్రం సమర్థించుకున్నారు. అదానీకి తాము రాష్ర్టాన్ని కట్టబెట్టడం లేదని చెప్పారు. రాష్ట్రంలోకి ఎవరైనా రావొచ్చని, ఎవరైనా పోవచ్చని చెప్పడం గమనార్హం.