సంగారెడ్డి జూన్ 27(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కల్పగూరులోని మంజీరా బరాజ్ ఎలాంటి డేంజర్లో లేదని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంజీరా బరాజ్‌ను సందర్శించారు. మంజీరా బరాజ్, బరాజ్ గేట్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించారు. మంజీరా బరాజ్ పిల్లర్లకు ఏమైనా పగుళ్లు వచ్చాయా? అనే కోణంలో ఇరిగేషన్, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మంజీరా బరాజ్ వద్ద మీడియాతో రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. మంజీరా బరాజ్ పిల్లర్లకు క్రాక్స్ వచ్చాయన్నది పూర్తిగా అబద్ధమని చెప్పారు. పియర్స్ కూడా కుంగలేదని తెలిపారు.
బరాజ్ దిగువన అఫ్రాన్ దెబ్బతిన్నదని, మరమ్మతుల కోసం రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే పనులు చేపడతామని వెల్లడించారు. అయితే, మంజీరా బరాజ్ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని, బరాజ్ డేంజర్లో ఉన్నదంటూ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు తప్పా? అని మీడియా ప్రశ్నించగా.. రాహుల్ బొజ్జా మౌనం వహించారు.
సింగూరు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నివేదిక కూడా తమకు అందలేదని రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. సింగూరు ప్రాజెక్టు ఆధునికీకరణ, కాల్వల పనులు కొనసాగుతాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని విలేకరులు ప్రశ్నించగా, ప్రస్తుతం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ఇప్పుడు తమ ప్రాధాన్యం కాదని తెలిపారు. జూరాల ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవీందర్‌రెడ్డి, హెచ్ఎండీఏ జీఎం మాణిక్యం, ఇరిగేషన్ అధికారి అమృత్‌రావు తదితరులు పాల్గొన్నారు.