ఖైరతాబాద్, ఆగస్టు 12: దామగుండం అడవిని పరిరక్షించాలని, రాడార్ ప్రాజెక్టు కోసం రిజర్వ్ ఫారెస్టు భూమిని కేటాయించడాన్ని విరమించుకోవాలని ‘ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్’ స్వచ్ఛంద సంస్థ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆ సంస్థ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత్ కిసాన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డీకే చంద్రశేఖర్ యాదవ్, ‘ట్రూ హెల్పింగ్ హ్యాం డ్స్’ ప్రధాన కార్యదర్శి మేకల కార్తీక్ యాదవ్ మాట్లాడుతూ.. వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం వికారాబాద్ జిల్లా పూడురు మండలంలోని దామగుండం అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారని తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం 2,900 ఎకరాల్లో 12 లక్షల చెట్లను నరికివేయాల్సి ఉంటుందని చెప్పారు. దీనివల్ల 20 గ్రామాల్లోని 60 వేల మంది ప్రజల ఆరోగ్యం, జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని, పశువులకు మేత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.