హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): నాయీబ్రాహ్మణ, రజక ఫెడరేషన్లకు కలిపి రూ.75 కోట్లను విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఫెడరేషన్ల కమిటీ కన్వీనర్ రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సెలూన్లు, దోభీఘాట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఈ నిధులు విడుదల చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. లక్షా 8 వేల మంది నాయీబ్రాహ్మణులు, రజకులకు కలిపి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నదని పేర్కొన్నారు. వీటిలో రజకులకు రూ.13 కోట్లు, నాయీ బ్రాహ్మణులకు రూ.12 కోట్లు, రెండు ఫెడరేషన్లకు రూ.25 కోట్ల చొప్పున ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌కు నాయీబ్రాహ్మణులు, రజకుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.