హైదరాబాద్ సిటీబ్యూరో/ మన్సూరాబాద్, ఆగస్ట్ 22 (నమస్తే తెలంగాణ): బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ముఠాను మీర్పేట్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటనలో ముగ్గురికి ప్రత్యక్షంగా, నలుగురికి పరోక్షంగా సంబం ధం ఉందని, అందరినీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. మంగళ్‌హాట్, సీతారాంపేట్‌కు చెందిన అబెద్బిన్ ఖాలెద్ కొంతకాలంగా నందనవనం ప్రాంతంలో నివసిస్తూ స్థానికంగా ఉండే తహసీన్, మంకాల మహేశ్, ఎం నర్సింగ్, అష్రఫ్, ఎండీ ఫైజల్, ఎండీ ఇమ్రాన్‌తో ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు.
బంధువుల ఇంటికి వచ్చిన బాలికపై
లాలాపేటకు చెందిన బాలిక తన ఇద్దరు సోదరులతో కలిసి వారం క్రితం నందనవనంలో ఉండే తమ అమ్మమ్మ ఇంటికి వచ్చింది. 19న ఇంటి బయట ఉన్న బాలికతో అబెద్ అసభ్యంగా ప్రవర్తించాడు. 21న ఉదయం 11 గంటలకు ఇంట్లో బాలిక, ఆమె సోదరులు మాత్రమే ఉండడాన్ని గమనించిన నిందితుడు తన గ్యాంగ్ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. అబెద్, తహసీన్, మహేశ్ ఇంట్లోకి వెళ్లగా, మిగతావారు బయట కాపలాగా ఉన్నారు. ఇంట్లోకి వెళ్లిన నిందితులు బాలికకు కత్తిచూపించి చంపేస్తామని బెదిరించి ఆమె సోదరుల ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమవడం తో కర్ణాటక వైపు పరారయ్యేందుకు యత్నించారు. ఉమ్నాబాద్ వరకు వెళ్లిన నిందితులు ప్లాన్ మార్చుకుని మరింత దూరం పారిపోవాలని భావించారు. అందులో భాగంగా డబ్బులు, దుస్తుల కోసం తిరిగి హైదరాబాద్ వచ్చి పోలీసులకు చిక్కారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చూస్తామని సీపీ తెలిపారు.
థర్డ్ డిగ్రీ కేసు దర్యాప్తు చేస్తున్నాం
ఎల్బీనగర్ స్టేషన్లో మహిళపై థర్డ్ డిగ్రీకి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి, ఎస్సైని బదిలీ చేశామని సీపీ తెలిపారు. బాధితురాలి నుంచి పోలీసులు డబ్బు, బంగా రం తీసుకున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, దీనిపై హైకోర్టుకు లిఖితపూర్వక సమాధానం ఇస్తామని చెప్పారు.