రవీంద్రభారతి, సెప్టెంబర్ 10: రూ.8వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం తెలంగాణ సాధన తరహాలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. గురువారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన 14 బీసీ సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలతో కలిసి ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించకపోవడంతో 14 లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ సమావేశంలో ఫీజు రీయింబర్స్‌పై చర్చ సాగించి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఏటా రూ. 2వేల కోట్లు బకాయిలు చెల్లించారని, ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థులకు హాస్టళ్లలో సన్నబియ్యం, 160 గురుకుల పాఠశాలలు మంజూరు చేశారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధివచ్చేలా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు నిలదీయాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కోసం ప్రజాప్రతినిధుల ఇండ్లతోపాటు సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.