హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్న ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) అభివృద్ధిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. 11 కోట్లు వెచ్చించగా, భారీగా అవినీతి జరిగినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఆరుట్ల గ్రామ ప్రజలు, కొందరు స్థానిక కాంగ్రెస్ నేతలే ఈ ఆరోపణలు చేస్తున్నారు. తమ అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని ఆరుట్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా ఆధునీకరించారు.
ఈ పాఠశాలను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. అభివృద్ధి పేరిట దాదాపు రూ.11 కోట్లు వెచ్చించారు. సోషల్ డెమోక్రటిక్ ఫోరం విరాళాల రూపంలో రూ.3 కోట్లు సమకూర్చింది. రూ.8 కోట్లు ప్రభుత్వ నిధులు వెచ్చించారు. జీఎమ్మార్ సంస్థ సైతం పాఠశాలలో అభివృద్ధి కోసం సీఎస్సార్ నిధులు వెచ్చించింది. కొనుగోళ్లు మొత్తం ఒక మహిళా కన్సల్టెంట్ చేతు ల మీదుగా జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కన్సల్టెంట్ ఓ పెద్ద వ్యక్తికి బినామీ అని, ఎన్జీవో ముసుగులో కొనుగోళ్లు, పనులు జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది. కొనుగోళ్లల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, స్థానిక కాంగ్రెస్ నేతలు కొందరు ఆరోపణలు గుప్పించారు. పాత వాటికే పూతలు పూశారని విమర్శించారు.
అవాక్కైన కాంగ్రెస్ నేతలు..
ఆరుట్ల గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్ నేతల బృందం పాఠశాలను సందర్శించింది. ఈ బృందంలోని కొందరు కాంగ్రెస్ నేతలు పాఠశాలను చూసి అవాక్కయ్యారు. పాత పిల్లర్లు, పాత స్కూల్‌కు కొత్త కిటికీలు మాత్రమే బిగించారని మండిపడ్డారు. వీటికే 12 కోట్లు ఖర్చవుతుందా? అంటూ ప్రశ్నించారు. రూ. 12కోట్లతో కొత్త భవనాలు కట్టవచ్చు. పాత భవనం మీద రేకులేశారు. రేకులు వేస్తే ఎన్ని లక్షలు ఖర్చవుతాయంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. స్కూల్ ప్రారంభోత్సవానికి ముందే బిగించిన నల్లాలు ఊడిపోవడంపై నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు.
విచారణ జరుపాలన్న డిమాండ్లు
ఈ పాఠశాల కొనుగోలు చేసిన వస్తుసామగ్రి వివరాలు బహిర్గతం చేయాలని కొందరు తల్లిదండ్రులు, స్థానిక నాయకులు డిమాండ్ చేశారు. రెండు నెలల నుంచి పెద్ద ఎత్తున వస్తుసామగ్రి కొనుగోళ్లు జరిగాయి. కొనుగోళ్లు, ఖర్చుల వివరాలు వెల్లడించాలంటున్నారు. ఇదే విషయంపై ఆరా తీయగా, కొందరు నోళ్లు మూయించే ప్రయత్నం జరిగిందని పేర్కొంటున్నారు. నిధుల వెచ్చింపుపై సమగ్ర విచారణ జరుపాలని స్థానిక నాయకులు అంటున్నారు.
ఆహ్వానించి అవమానిస్తారా.. టీచర్ల ఫైర్
ఆరుట్ల టీపీఎస్ ప్రారంభోత్సవానికి ఉత్సాహంతో వెళ్లిన ఉపాధ్యాయ సంఘాల నేతలకు చుక్కెదురయ్యింది. సంఘాల నేతలను ఆహ్వానించిన సర్కార్ వారిని సభా ప్రాంగణంలోకి అనుమతించకుండా అవమానించింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ ఉపాధ్యాయ సంఘాల నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి సంఘ నాయకులకు సమాచారం వెళ్లింది. అయితే వీరికి ఎలాంటి పాస్‌లు ఇవ్వలేదు. సభా ప్రాంగణంలోకి పాస్‌లున్న వారినే అనుమతించారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల నేతలు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందంగౌడ్ మాట్లాడుతూ.. తమను విద్యాశాఖ అధికారులు ఘోరంగా అవమానించారని వాపోయారు. చివరికి పోలీసులు కల్పించుకొని సముదాయించారు.
మొన్న రాజీనామా.. నేడు హడావుడి
విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మళ్లీ ప్రత్యక్షమయ్యారు. కమిషన్ చైర్మన్ పదవికి గత నెలలో రాజీనామా చేసిన ఆయన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో తెగ హడావుడి చేశారు. ఏకంగా వేదికపై ఆసీనులై కమిషన్ చైర్మన్ హోదాలో ప్రసంగించారు కూడా. ఆయన మే 22న కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాను సర్కార్ ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టింది.