హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఎప్‌సెట్ హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను ముద్రించారు. ఇలా క్యూఆర్ కోడ్‌ను ముద్రించడం ఇదే తొలిసారి. పైగా గూగుల్ మ్యాప్‌తోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌లో స్కాన్ చేసినా సెంటర్ లోకేషన్ ఇట్టే చూపిస్తుంది. మీరున్న ప్రాంతం నుంచి సెంటర్ ఎంత దూరమో.. ఆయా సెంటర్లకు ఎన్ని రూట్లున్నాయో.. ట్రాఫిక్ ఎలా ఉందో.. ఎంత సమయం పడుతుందో ఇట్టే చెప్పేస్తుంది. ఇలాంటి విశేషాలతో జేఎన్టీయూ అధికారులు క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. అగ్రికల్చర్, ఫార్మసీ హాల్‌టికెట్లను శనివారం విడుదల చేస్తామని, 22న ఇంజినీరింగ్ విభాగం హాల్‌టికెట్లను వెబ్సైట్లో పొందుపరుస్తామని ఎప్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
విద్యార్థులు పరీక్షకు ఒక రోజు ముందు కాకుండా, హాల్‌టికెట్లను మొదటి రోజే డౌన్లోడ్ చేసుకుని వివరాలన్నింటిని సరిచూసుకోవాలని జేఎన్టీయూ అధికారులు సూచించారు. ఏమైనా తప్పులుంటే 24వ తేదీలోపు మాత్రమే సవరించుకోవచ్చని, ఆ తర్వాత ఎలాంటి అవకాశం ఉండబోదని పేర్కొన్నారు. చివరి నిమిషంలో తమ దృష్టికి తీసుకొస్తే సెంటర్లను కేటాయించడం సాధ్యం కాదని తెలిపారు. పరీక్ష రాసే అవకాశం కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడాన్ని నియంత్రించేందుకు బయోమెట్రిక్‌తోపాటు ముఖ ఆధారిత గుర్తింపు హాజరు విధానాన్ని (ఫేషియల్ రికగ్నిషన్) అమలుచేస్తున్నారు. ఈ నెల 29 నుంచి ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీకి మూడు సెషన్లు, మే 2, 3,4 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగానికి ఆరు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీకి 112, ఇంజినీరింగ్‌కు 124 సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్‌కు ఈ సారి దరఖాస్తులు తగ్గాయి. నిరుటితో పోల్చితే 13వేల దరఖాస్తులు తక్కువగా వచ్చాయి. నిరుడు తెలంగాణ నుంచి 2,93,383 మంది ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేయగా, ఈ సారి 2,80,343 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ సారి మొత్తం 3,05,774 దరఖాస్తులొచ్చాయి. వీటిలో 25,431 దరఖాస్తులు ఏపీసహా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చాయి. 505 మంది ఆంగ్లో ఇండియన్స్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో మొత్తం సీట్లు మనోళ్లకే రిజర్వుచేశారు. ఇతర రాష్ర్టాల విద్యార్థులకు సీట్లు ఇవ్వబోమని ప్రకటించారు. అయినా తెలంగాణలోనే బీటెక్ చదివేందుకు ఇతర రాష్ర్టాల విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. స్థానికేతరులకు కన్వీనర్ కోటా సీట్లు పొందే అవకాశం లేదు. బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్లకోసం జేఈఈతోపాటు ఎప్‌సెట్ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటున్నారు. టాప్ కాలేజీలు హైదరాబాద్‌లోనే ఉండటం, ఐటీ ప్లేస్‌మెంట్స్, మంచి ప్యాకేజీల నేపథ్యంలో ఏపీ సహా ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు తెలంగాణలో చదివేందుకు, ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.