Lagcherla | వరంగల్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ జయశంకర్ భూపాలపల్లి (నమస్తే తెలంగాణ)/ పలిమెల : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలోని లగచర్ల తరహాలోనే.. పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నియోజకవర్గం మంథనిలోనూ భూ బాగోతం మొదలైంది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్నప్పుడు మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు పరకాష్టకు చేరింది. దశాబ్దాలుగా పేద రైతులు సాగు చేసుకుంటున్న భూములు పరిశ్రమల పేరిట మంత్రి అనుచరుల పేరు మీదికి, ఇప్పడు వారి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీదికి మారుతున్నాయి. మొత్తం వ్యవహారంలో మంత్రి శ్రీధర్‌బాబు సోదరుడు శీనుబాబు కీలకంగా వ్యవహరిస్తున్నాడని రైతులు మండిపడుతున్నారు. కొత్తగా పెట్టే సిమెంటు ఫ్యాక్టరీలో సగం వాటా కోసమే ఇదంతా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి సమీపంలోని పలిమెల మండల కేంద్రంలోని పచ్చని పంట భూములను సిమెంట్ పరిశ్రమకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వేగంగా పావులు కదుపుతున్నారు. సుమారు 300 ఎకరాల పేదల భూమికి ఎసరు పెట్టిన ఆయన, రైతులకు తెలియకుండానే వారికి చెందిన సుమారు 200 ఎకరాల భూమిని కొన్నేండ్ల కిందటే తన అనుచరులైన కాంగ్రెస్ నేతల పేరిట రిజిస్ర్టేషన్ చేయించారు. ఇప్పుడు వారి నుంచి దక్కన్ సిమెంట్ పేరు మీదికి మళ్లీ రిజిస్ర్టేషన్ చేస్తుండడంతో విషయం కాస్తా రైతులకు చేరింది. తమ జీవనాధారమైన భూములు పోతున్నాయని తెలిసి రైతులు ఒక్కసారిగా గగ్గోలు పెడుతున్నారు. భూములను కాపాడుకునేందుకు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ప్రాణాలు పోయినా తమ భూములను వదులుకునేది లేదని తేల్చిచెప్తున్నారు.
పలిమెల మండల కేంద్రం (గతంలో మహదేవపూర్ మండలంలోని గ్రామం) శివారులో 26 వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్న సీలింగ్ భూములను బోడాయిగూడెం, పంకెన, పలిమెలకు చెందిన సుమారు 150 మంది దళిత, గిరిజన రైతులు 60 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. మాజీ పట్వారీ ఉప్పు లక్ష్మణ్‌రావు, భూస్వాములు పాషాదొర, ఊర జగన్నాథరావు, జంగు సిపాయి ఖాజా నసీరొద్దీన్ పేర్లతో ఈ భూములు ఉండేవి. 1975-76లో వచ్చిన సీలింగ్ చట్టంతో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. 60 ఏండ్లుగా రైతులు ఈ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. మోకాపై, కాస్తులో ఉన్న రైతుల గురించి విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు, ఆ తర్వాత కొందరికి తోక పాస్ పుస్తకాలు ఇచ్చారు.
30 ఏండ్ల క్రితం గోదావరి ఉప్పొంగి ఊరు మునిగి రైతులు నిరాశ్రయులయ్యారు. ఆ తర్వాత అధికారులు సీలింగ్ భూములను అక్రమంగా విరాసత్ చేసి బోగస్ పట్టాలు ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. పలిమెల శివారులోని పేదలు కాస్తు చేసుకుంటున్న భూములను 2008లో కాంగ్రెస్ నేతలు తమ పేరిట రిజిష్ర్టేషన్ చేసుకున్నారు. మంత్రి సొంత ఊరు ధన్వాడతోపాటు మంథని నియోజకవర్గంలోని లద్నాపూర్, కేశవపల్లి, 8 ఇైంక్లెన్ కాలనీకి చెందిన కాంగ్రెస్ నేతలు, అనుచరుల పేరిట ఈ భూములను అప్పట్లో రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. తమకు తెలియకుండా ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ కావడంపై అప్పటినుంచీ రైతులు ఆందోళన చేస్తూ వస్తున్నారు.
16 ఏండ్ల క్రితం తమ పేరిట భూములను రిజిస్ర్టేషన్ చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, మంత్రి అనుచరులు రెండుమూడు రోజులుగా ఈ భూములను దక్కన్ సిమెంట్ కంపెనీకి రిజిస్ర్టేషన్ చేయిస్తున్నారు. రైతులకు ఈ సమాచారం తెలియడంతో ఆందోళనకు దిగారు. సీలింగ్ భూములను అక్రమంగా విరాసత్ పట్టాలు సృష్టించి ఇప్పుడు కాంగ్రెస్ నేతల పేర్ల మీదికి, ఆ తర్వాత కంపెనీకి అమ్మినట్టు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
భూ దందాపై పలిమెలలోని రైతులు ఆగ్రహం వ్యక్త చేస్తూ నిరసనలకు సిద్ధం కావడంతో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ మంగళవారం పలిమెల రైతువేదిక వద్ద రైతులతో మాట్లాడారు. ఎంతమంది రైతులు, ఎన్నేండ్లుగా సాగు(కాస్తు)లో ఉన్నారని తెలుసుకున్నారు. రైతుల వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నారు. భూములను దక్కన్ కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించిన పలిమెల తహసీల్దార్ విచారణలో ఎక్కడా కనిపించకపోవడం ఆనుమానాలకు తావిస్తున్నది. పలిమెల తహసీల్దార్ వివరణ కోరగా భూములు దాదాపు 50 ఏండ్లుగా కాస్తులో ఉన్నది వాస్తవమేనని, రికార్డుల్లో ఇతరుల పేర్లు ఉన్నాయని చెప్పారు.
దక్కన్ సిమెంట్ కంపెనీలో మంత్రి శ్రీధర్‌రాబు తమ్ముడు శీనుబాబు 50 శాతం వాటాకు ఒప్పం దం కుదుర్చుకొని పేదల భూములను పణంగా పెట్టారన్న ఆరోపణ లు వస్తున్నాయి. 2008లో మం త్రిగా ఉన్న శ్రీధర్‌బాబు తన అనుచరుల పేరిట 202 ఎకరాలు, మరో 100 ఎకరాలు ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారని రైతులు చెప్తున్నారు. ధరణి వ్యవస్థను కాంగ్రెస్ భూమాతగా మారుస్తున్న నేపథ్యం లో అందులో కాస్తుకాలం, కబ్జాకాలం పెట్టే అవకాశాలున్నాయన్న సమాచారంతో మంత్రి శ్రీధర్ బా బు, అనుచరుల పేరిట ఉన్న భూ ములను దక్కన్ కంపెనీకి రిజిష్ర్టేషన్ చేయించడం మొదలుపెట్టారని చెప్తున్నారు. ఇప్పటివరకు 102.35 ఎకరాల భూమి దక్కన్ సిమెంట్స్‌కు ధారాదత్తం అయింది. రైతుల నిరసనలకు భయపడి తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది.
మంత్రి శ్రీధర్‌బాబు తమ్ముడు శీనుబాబుకు దక్కన్ సిమెంట్ కంపెనీలో 50 శాతం వాటాకు ఒప్పందం కుదుర్చుకొని పేదల భూములను అక్రమంగా.. అప్పనంగా కట్టబెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. బాధిత రైతులతో కలిసి మంగళవారం ఆయన పలిమెలకు వెళ్లి భూములను పరిశీలించారు. కాస్తులో ఉన్న భూములను మంత్రి శ్రీధర్‌బాబు తన అనుచరులైన వనం రాంచందర్‌రావు, చొప్పరి సదానందం, రొడ్డ బాపు, బండారి సదానందం, బొల్లపల్లి వెంకటస్వామిగౌడ్, పులి రాజేశం, తుల్సెగారి తిరుపతి, పున్నం మధుకర్‌రెడ్డి, చల్లా జక్కిరెడ్డితోపాటు మరి కొంత మంది పేరిట 2008లో రిజిస్ర్టేషన్ చేయించారని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు 200 ఎకరాల వరకు మహ్మాద్ కమాలుద్దీన్ అనే వ్యక్తి ద్వారా మంథనిలో రిజిష్ర్టేషన్ చేయించారని చెప్పారు. రైతుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.
మా అసొంటి పేదల జీవితాలతో ఆడుకోవద్దు. మా భూములు మాగ్గాకుండ జేస్తరా? మాకు తెలియకుండా వేరేవాళ్ల పేర్ల మీదికి ఎట్ల రిజిస్ట్రేసన్ చేస్తరు? మా అమ్మ, అమ్మమ్మ నుంచి ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నం. మా భూముల జోలికొస్తే ఊరుకునేది లేదు.
-పాగె లక్ష్మి, పంకెన