ప్రజాభవన్, ఆగస్టు 2: కాంగ్రెస్ సర్కారు వైఖరిపై ప్రజల్లో నిరసన పెల్లుబుకుతుందనడానికి శుక్రవారం ప్రజాభవన్‌కు తరలివచ్చిన వందలాది మందే సాక్ష్యం. ఆరు గ్యారెంటీల ఆశచూపి అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా వాటిని పూర్తిగా ఎందుకు అమలుచేయడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. హామీలను అమలుచేయాలని తెలంగాణ ఉద్యమకారులు, చిన్న కేసుల్లో క్లీన్చిట్ పొందినా తమకు అపాయింట్మెంట్ ఎందుకివ్వడం లేదని పోలీస్ అభ్యర్థులు, గ్రామీణ అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని జీవో 46 బాధితులు ప్రజాభవన్ వద్ద నిరసన తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజలు వందలాది మంది తరలిరాగా, ఒక్కరోజే 472 వినతులు అందజేయడం గమనార్హం. రెవెన్యూ శాఖకు 107, సివిల్ సప్లయ్‌కు64, విద్యుత్తుకు 59, సోషల్ వెల్ఫేర్‌కు 31, మైనార్టీ వెల్ఫేర్‌కు 26, ఇతర విభాగాలకు 165 చొప్పున అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
మళ్లీ ప్రజాభవన్ మెట్లెక్కిన తొలి అర్జీదారులు
ప్రజాభవన్‌లో స్వీకరించిన తొలి అర్జీ 8 నెలలు గడిచినా తీరలేదనడానికి ఇదే నిదర్శనం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల గ్యారెంటీని వెంటనే అమలు చేయాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ మలిదశ ఉద్యమకారులు ప్రజాభవన్ ప్రారంభమైనప్పుడు తొలి ఆర్జీ పెట్టుకున్నారు. అది నేటికీ పరిష్కారానికి నోచలేదు. దీంతో శుక్రవారం మళ్లీ ప్రజాభవన్‌కు వచ్చారు. నెలలు గడిచినా తమకిచ్చిన గ్యారెంటీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. 8 నెలలుగా ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఉద్యమకారులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రులను, ఎమ్మెల్యేలను కలిసినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మలిదశ ఉద్యమకారులకు తక్షణమే ఇండ్లస్థలాలు ఇవ్వాలని విజ్ఙప్తి చేశారు.
కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన
మర్డర్, పోక్సో కేసుల్లో ఉన్న వారికి నియామక ఆర్డర్ కాపీలిచ్చి చిన్న కేసుల్లో క్లీన్చిట్ పొందిన తమకు ఎందుకు ఇవ్వలేదని కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ నియామకాలు-2022లో ఎంపికై పలు కేసుల కారణంగా నియామకాలు నిలిపివేయడంతో శుక్రవారం వివిధ జిల్లాల నుంచి ప్రజాభవన్‌కు తరలివచ్చి నిరసన తెలిపారు. తాము ఇప్పటివరకు కలిసిన వారి ఫొటోలతో ఉన్న బ్యానర్‌ను ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై విరుచుకుపడ్డారు. తామేమైనా మర్డర్ కేసుల్లో ఉన్నామా? రేప్ కేసుల్లో ఉన్నామా? చిన్న చిన్న పెట్టీ కేసుల్లో ఉన్న తమపై పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు కొట్టివేసిన కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి శిక్షణకు పంపాలని డిమాండ్ చేశారు. కేసుల కారణంగా 326 మందిలో 158 మందికి ఆర్డర్ కాపీలిచ్చి మిగతా వారికి ఇవ్వలేదని, ఇది అనుమానాలకు తావిస్తుందని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ 326 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని, మిగతా 168 డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులందరికీ రోజురోజుకూ ఆర్థిక ఇబ్బందులు తీవ్రమవుతున్నాయని ఆవేదన చెందారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో నంబర్ 46 బాధితుల ధర్నా
పోలీస్ నియామక ప్రక్రియలో జీవో నంబర్-46 బాధితులు శుక్రవారం ప్రజాభవన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రెవెన్యూ జిల్లాల జనాభాను ప్రాతిపదికగా చేసుకుని పోస్టులు కేటాయిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసం వల్లే పట్టణ ప్రాంత అభ్యర్థులకు ఎక్కువ ఉద్యోగాలు దక్కుతాయని, తద్వారా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందని వాపోయారు.
పింఛన్లు పెంచాలని బీడీ కార్మికుల ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను రూ.4,016కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు శుక్రవారం ధర్నా చేశారు. బస్టాండ్ నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఆఫీస్ ఎదుట బైఠాయించారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణకు వినతిపత్రాన్ని సమర్పించారు.