హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూములను వేలం వేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా వేదికగా విద్యార్థి, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల నేతలు, జర్నలిస్ట్‌లు, పౌరులు ఖండిస్తున్నారు. ఏడాదిగా తెలంగాణలో రేవంత్ అరాచకం నడుస్తున్నదని, కాంగ్రెస్ పెద్దలు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.
రోహిత్ వేముల విషయంలో ఢిల్లీ నుంచి వచ్చిన రాహుల్జీ.. హెచ్‌సీయూ భూముల కోసం రేవంత్‌రెడ్డి పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తున్నారు. క్విడ్ ప్రోకో కమీషన్లకు బదులుగా టీజీఐఐసీ వేలం ద్వారా కార్పొరేట్ లాభం కోసం అడవిని నరికేస్తున్నారు. విద్యార్థులపై లాఠీ చార్జీలు జరుగుతున్నాయి. ఇలాంటి దుశ్చర్యలతో రేవంత్‌రెడ్డి.. ఇందిరాగాంధీని అపహాస్యం చేస్తున్నారు. క్రూరమైన విధ్వంసాన్ని ఆపండి. భూముల వేలాన్ని ఖండించండి. హెచ్‌సీయూ క్యాంప స్ నుంచి జేసీబీలు, పోలీసు శిబిరాలను తొలగించండి.
-దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్సీ
చరిత్రలో భూములను గుంజుకున్నోడు ఎవడూ గెలవలేదు. హైడ్రా, మూసి, లగచర్ల చేదు అనుభావల తర్వాత మళ్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంటే అసలు మీకు కొంచెం కూడా సిగ్గులేదు. రాసుకో రేవంత్‌రెడ్డి గారు! ఇందులో కూడా మీకు ఓటమి తప్పదు.
-రాకేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు
హెచ్‌సీయూ భూముల పరిక్షణ కోసం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మరోవైపు జీవివైవిధ్య సంపద కలిగిన 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టు కోసం చదును చేస్తున్నది. న్యాయస్థానం విచారణకు ముందే బుల్డోజర్లను ఎందుకు రంగంలోకి దింపినట్టు?
-బహర్దత్, పర్యావరణ జర్నలిస్ట్
తెలంగాణలో ప్రస్తుతం క్రికెట్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ జగన్మోహన్రావు మధ్య జరుగుతున్నది. మరోవైపు భూమి విషయంలో ప్రభుత్వం వర్సెస్ విద్యార్థులుగా నడుస్తున్నది.
– కొరీనా ఎనెత్, జర్నలిస్ట్
రాహుల్‌గాంధీ ఎక్కడికి వెళ్లినా రాజ్యాంగాన్ని వెంటబెట్టుకుని వెళ్తారు. కానీ తెలంగాణలో తప్పు వ్యక్తిని ఎంపిక చేసుకుని ఎమర్జెన్సీ పరిస్థితి తీసుకొచ్చారు.
-చార్వాక