చిక్కడపల్లి, మే 3: ఖనిజ సంపదను దోచుకునేందుకే ఆపరేషన్ కగార్‌ను కేంద్రం చేపడుతున్నదని పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆరోపించింది. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో ఆదివాసీల హననాన్ని ఆపాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలని శనివారం సుందరయ్యపార్కు నుంచి ఇందిరాపార్కు వరకు శాంతిర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అరుణోదయ విమలక్క, వేదిక కన్వీనర్ సాంబమూర్తి, బీసీ కే రాష్ట్ర అధ్యక్షుడు జీ శ్రీనివాస్, పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల మధ్య విస్తరించి ఉన్న దండకారణ్యంలోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఆపరేషన్ కగార్‌ను ఆపాలన్నారు..