హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న మారణహోమంపై సుప్రీంకోర్టు స్వతంత్ర న్యాయ కమిషన్ చేత విచారణ జరిపించాలని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం విమలక్క, పట్లోళ్ల నాగిరెడ్డి, వెల్తురు సదానందం, మల్లేశం, అంజయ్య, రాయిసిడం బాబురావు, అల్లూరి విజయ్, ఏపూరి మల్సూర్, రమేశ్ పోతుల, అరుణలు ఒక ప్రకటన విడుదల చేశారు.
నంబాల కేశవరావుతో సహా 26మందిని ఎన్కౌంటర్ చేసిన వారిపై సుప్రీంకోర్టు కేసు నమోదు చేసి, వీడియో రికార్డింగ్ ద్వారా బంధుమిత్రుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మృతుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరారు. కేంద్రం ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేసి.. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపటానికి ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు. 16ఏండ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని ఖనిజ సంపదలపై జరిగిన వ్యాపార ఒప్పందాలన్నింటిని ప్రభుత్వం బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు.