హైదరాబాద్, మార్చి 8(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రాంతంలో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను ఏర్పాటు చేసిన పడాల రాంరెడ్డి ఇకలేరు. వయోభారంతో బుధవారం మృతి చెందారు. పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం పీతల వేమవరం గ్రామంలో పుట్టిన పడాల రాంరెడ్డి, న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న అనంతరం హైకోర్టు లైబ్రేరియన్‌గా, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌గా సేవలు అందించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటు లా కళాశాల అవసరాన్ని గుర్తించిన ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.1988లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ ఎల్లారెడ్డిగూడలో తొలి ప్రైవేటు న్యాయ కళాశాలను ఏర్పాటు చేసి న్యాయ విద్యాభివృద్ధికి రాంరెడ్డి కృషి చేశారు. విద్యార్థులకు న్యాయ సలహాలు ఇస్తూ వారిని ప్రోత్సహించేవారు, ఇప్పటివరకు ఎంతోమంది న్యాయ కోవిదులను తీర్చిదిద్దారు. భారత రాజ్యాంగం, న్యాయశాస్ర్తానికి సంబంధించి 120 పుస్తకాలను రచించారు. ఆయన కొడుకు హైదరాబాద్‌లో స్థిరపడగా, కూతురు యూఎస్‌లో నివాసం ఉంటున్నది. గండిపేటలో స్థిరపడిన కొడుకు శ్రీనివాస్‌రెడ్డి వద్దనే గత రెండు నెలలుగా ఉంటున్న పడాల రాంరెడ్డి వయోభారంతో మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
అస్వస్థతకు గురైన రాంరెడ్డి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలిసింది. భౌతికకాయాన్ని నిమ్స్‌కు తరలించారు. గురువారం అంతిమ సంస్కారాలు జరగనుండగా, పంజాగుట్టలోని ద్వారకాపురి కాలనీలో ఆయన సొంతింటిలో భౌతికకాయాన్ని సందర్శనార్థం ఉంచనున్నారు.