హైదరాబాద్, మే26 (నమస్తే తెలంగాణ): జేఏసీకి ఇచ్చిన హామీ మేరకు పాఠశాల పునఃప్రారంభానికి పూర్వమే గురుకుల విద్యాసంస్థల్లో 317 జీవో బదిలీలను పూర్తిచేయాలని, ప్రమోషన్లు కల్పించాలని, టీచర్లకు రాత్రిబసను ఎత్తేయాలని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లోని టిగారియా సంఘం కార్యాలయంలో గురుకుల జేఏసీ ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సంఘాల బాధ్యులు హాజరై పలు అంశాలపై సమాలోచనలు జరిపారు. గురుకులాల్లో సరైన సౌకర్యాలు కల్పించకపోవడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా అన్ని గురుకులాలకు కామన్ అడ్మినిస్ట్రేషన్ కోసం గురుకుల డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సమావేశంలో గురుకుల జేఏసీ అధ్యక్షుడు మామిడి నారాయణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ మధుసూదన్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం రామకృష్ణయ్య పాల్గొన్నారు.