ఈటల హుజూరాబాద్‌లో మాట్లాడుతూ గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను వేస్తున్నదంటారు. కమలాపూర్‌లో మాట్లాడుతూ రూ.250 పన్ను విధిస్తున్నదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి కేంద్రం సిలిండర్‌పై 5% జీఎస్టీ వేస్తున్నది. అందులో రాష్ట్రవాటా కింద వచ్చేది 23.80 పైసలు (2.5%) మాత్రమే. అంతకుమించి రాష్ర్టానికి వస్తుందని ఈటల నిరూపిస్తే దేనికైనా సిద్ధం.
-ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): గ్యాస్‌బండపై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను విధిస్తున్నదని అబద్ధాలాడిన బీజేపీ నేత ఈటల రాజేందర్ దానిని నిరూపించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సవాలు విసిరారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో ఆర్ఎంపీల సంక్షేమ సంఘం, వడ్డెరుల ఆశీర్వాద సభలో పాల్గొన్న హరీశ్‌రావు ‘రాజేంద్రా.. గ్యాస్‌పై చర్చకు సిద్ధమా? రాష్ట్ర పన్ను రూ.291 ఎక్కడున్నదో నిరూపిస్తవా? నువ్వు చెప్పింది నిజమని నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా. నా పదవికి రాజీనామా చేస్తా. అబద్ధమని తేలితే నువ్వు పోటీ నుంచి తప్పుకొంటావా? గ్యాస్ ధరపై చర్చకు జమ్మికుంటలోని గాంధీ విగ్రహం దగ్గరైనా, హుజూరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం దగ్గరైనా సిద్ధం..’ అని సవాలు విసిరారు. ‘ఈటల హుజూరాబాద్‌లో మాట్లాడుతూ గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 పన్ను వేస్తున్నదంటారు. కమలాపూర్‌లో మాట్లాడుతూ రూ.250 పన్ను విధిస్తున్నదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నిజానికి కేంద్రం సిలిండర్‌పై 5% జీఎస్టీ ఉన్నది. అందులో రాష్ట్రవాటా 2.5% కింద 23.80 పైసలు మాత్రమే’ అని చెప్పారు. అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని ఈటల నిరూపిస్తే దేనికైనా సిద్ధమని అన్నారు. తనకు వందల ఎకరాల భూములున్నాయని, వాటిలో ఎకరం అమ్ముకొని అయినా హుజూరాబాద్‌లో గెలుస్తాననడం ఈటల అహంకారానికి నిదర్శనమని హరీశ్ అన్నారు. ప్రచారంలో తాము సంయమనంతో మాట్లాడుతుంటే.. ఈటల మాత్రం ‘అరేయ్, ఒరేయ్, బిడ్డా..’ అంటూ అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
ఎస్సీ, బీసీల భూములు కబ్జా చేసినప్పుడే ఈటల ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, సంక్షేమ పథకాలను పరిగె అనడం ఆయన అహానికి నిదర్శనమని హరీశ్ అన్నారు. పథకాలు ఈటలకు పరిగె కావొచ్చేమో కానీ, పేదలకు వరంలాంటివని చెప్పారు. 18 ఏండ్లుగా ఈటల పాలనను చూశారని, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఇక్కడి ప్రజలకు ఏమీ చేయలేదని.. గెల్లును గెలిపిస్తే.. ఈ రెండున్నరేండ్లలో ఏం చేస్తామో ఒక్కసారి చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల గుండెల్లో స్థిరపడిపోయిన కారు గుర్తును ఎవరూ మార్చలేరని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరిన రాజేందర్ గ్యాస్ ధరను రూ.500 తగ్గించగలడా? అని ప్రశ్నించారు.
ఈటల మంత్రిగా ఉన్న సమయంలో ఆర్ఎంపీల అసోసియేషన్ భవనం కూడా కట్టించలేదని హరీశ్ విమర్శించారు. తాను సిద్దిపేటలో నిర్మించానని, ఇక్కడా కట్టిస్తున్నామని, అన్ని మండలాల్లో భూమి పూజలు కూడా చేశామని గుర్తుచేశారు. ఆర్ఎంపీలు కూడా తనతోపాటు ఉద్యమంలో పాల్గొన్నారని, రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించామని, బడ్జెట్లో నిధులు కూడా పెట్టామన్నారు. గెల్లు శ్రీనివాస్ గెలిచిన తర్వాత వడ్డెరుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామన్నారు. సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకొనేందుకు రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈటలకు కమిట్మెంట్లేదని, ఉంటే సీఎం కేసీఆర్ ఇచ్చిన 4 వేల ఇండ్లు ఎప్పుడో నిర్మించేవాడని, తన పదవికి మధ్యలో రాజీనామా చేసేవాడు కాదని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అన్నారు. 24 గంటలు ప్రజల్లో ఉండి ఆర్ఎంపీలు వైద్య సేవలు అందిస్తారని చెప్తూ.. తాను గెలిచిన తర్వాత వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు. వంద కోట్లు ఖర్చు చేసైనా గెలుస్తామని ఈటల భార్య చెప్పడం దేనికి సంకేతమో అర్థం చేసుకోవాలన్నారు. ఈ సభల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, నేషనల్ లేబర్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ డైరెక్టర్ దండుగుల రాజ్యలక్ష్మి, ఆర్ఎంపీల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మనోహర్, నియోజకవర్గంలోని వివిధ మండలాల బాధ్యులు బాలరాజు, కృష్ణమూర్తి, అయిలయ్య, తిరుపతి, దేవదాసు, రవి, మల్లేశం, భీమన్న, జయమూర్తి, ఒడ్డెర సంఘం నాయకులు మైఖేల్, సమ్మయ్య, పల్లెపు పోశెట్టి, తిరుపతి, ఉప్పు శ్రీనివాస్, మహేందర్, రాంబాబు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే తెలంగాణ అన్నివిధాల అభివృద్ధి చెందుతుంది. స్వరాష్ట్రంలో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి సబ్బండ వర్ణాల ఎదుగుదలకు సీఎం కృషి చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనే వైశ్యులు రాజకీయంగా ఎన్నో పదవులను అధిరోహించారు. ప్రతిపక్ష నాయకులతో ఎలాంటి అభివృద్ధి జరుగదని ప్రజలు గుర్తించాలి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలుపించాలి. గెల్లు గెలుపుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధిస్తుంది.
-కోలేటి దామోదర్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్
దళితులపై ఆరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతున్న బీజేపీని ఓడించడమే దళితుల అంతిమ లక్ష్యం. హుజూరాబాద్ ఎన్నిక తెలంగాణ దళిత ప్రజలకు బీజేపీకి మధ్య జరుగుతున్న యుద్ధం. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కులం పేరుతో దూషించి 6 వేల మంది దళిత యువకులను హత్యచేసి, 4,200 మంది మహిళలు, బాలికలను అత్యాచారం చేసి చంపారు. రాజస్థాన్‌లో 500 మంది దళిత మహిళలను వివస్త్రలను చేసి బీజేపీ అవమానపరిచింది. వీటిపై బీజేపీ రాష్ట్ర్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సమాధానం చెప్పాలి. యూపీలో నల్ల చట్టాలు రద్దు చేయాలని ధర్నా చేస్తున్న రైతులను కార్లతో చంపించిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. దళితుల కోసం ఏంచేయని బీజేపీ హుజూరాబాద్‌లో ఓట్లు అడగాడనికి రావొద్దు.
-గజ్జెల కాంతం, ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్