సిరిసిల్ల రూరల్/ ఎల్లారెడ్డిపేట ఆగస్టు 1: సిరిసిల్ల నియోజకవర్గంలో దర్జాగా ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. ప్రొటోకాల్ అమలు చేయాల్సిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డిని వెంటబెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌కు సమాచారం ఇవ్వకుండానే అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ నేతల ఆందోళన, ఫిర్యాదుల నేపథ్యంలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కేటీఆర్, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఫొటోలు ఏర్పాటుచేశారు. శుక్రవారం తంగళ్లపల్లిలో అంగన్వాడీ భవనం, సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరులో మెప్మా ఎరువుల దుకాణం, ఎల్లారెడ్డిపేట కిషన్దాస్పేటలో అంగన్వాడీ నూతన భవనాన్ని కేకే మహేందర్‌రెడ్డితో ప్రారంభింపజేశారు. ఎల్లారెడ్డిపేట ఎంజేపీ కళాశాలలో అన్ అకాడమీ ఆన్లైన్ క్లాసులను కేకే, కలెక్టర్ ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డికి సమాచారం లేకపోవడంతో వారు అసహనం వ్యక్తంచేశారు. దీనిపై జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంను వివరణ కోరగా అంగన్వాడీ భవన నిర్మాణాలు పూర్తి కావడంలేదనే వార్తలు వస్తున్న క్రమంలో పూర్తయిన భవనాన్ని ప్రారంభించామని, మిగతా భవనాల ప్రారంభానికి అందరికీ సమాచారమిస్తామని సమాధానమిచ్చారు.