హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఇప్పుడో కొత్త సమస్య వచ్చిపడింది. కొన్ని జిల్లాల్లో ప్రొటోకాల్ సమస్య తలెత్తుతున్నది. ఈ జిల్లాలకు డీఈవోలుగా ఐఏఎస్లు, గ్రూప్-1 అధికారులు ఉండటమే కారణం. డీఈవోల పైస్థాయిలో ఆర్జేడీలు, అడిషనల్ డైరెక్టర్లు ఉండటంతో, ఆ తర్వాతి హోదా అయిన డీఈవో పోస్టులో ఐఏఎస్లు, గ్రూప్-1 అధికారులున్నారు. దీంతో ప్రొటోకాల్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎవరిని ఎవరు గౌరవించాలి.. ఎవరి ముందు ఎవరు కూర్చోవాలి.. ఎవరికి ఎవరు సమాధానం చెప్పాలన్న సమస్యలు, ఇబ్బందులొస్తున్నాయి. ఇదే కాకుండా డీఈవోలను ఆర్జేడీలు పర్యవేక్షిస్తుంటారు. డైరెక్టరేట్ నుంచి వచ్చే ఆదేశాలను డీఈవోలకు పంపిస్తుంటారు. ఐఏఎస్ల కంటే తక్కువ హోదా గల అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు… ఐఏఎస్లు, గ్రూప్ -1 అధికారులను అడిగే సాహసం చేయడంలేదు.