రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్)ను టీజీఎన్పీడీసీఎల్లో విలీనం చేయొద్దంటూ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, అధికారులు సెస్‌ను ఆధీనంలోకి తీసుకున్నామని, కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని బుధవారం ప్రకటించడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో గురువారం పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు గ్రామాల్లో జరిగిన ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ వార్డు, గ్రామసభల్లో నిరసనలు తెలిపారు.
సెస్‌ను విలీనం చేయొద్దని, సెస్ లైసెన్స్ రెన్యువల్ చేసి, యథావిధిగా కొనసాగించాలని విన్నవించారు. సిరిసిల్లలోని 3వ వార్డులో జరిగిన వార్డు సభలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ ఆర్డీవో వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. గ్రామాల్లోనూ బీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్‌లు గ్రామసభల్లో అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. పలు గ్రామసభలు, వార్డు సభల్లో తీర్మానాలు చేశారు. గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ వార్డు సభ్యులు నల్ల దుస్తులు ధరించి ప్రజాపాలన సభకు హాజరై నిరసన తెలిపారు.