హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో-252ను రద్దు చేసేంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ విషయంపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఆదివారం యాదగిరిగుట్టలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ.. జీవో 252పై ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసనలు నిర్వహించినట్టు తెలిపారు. ఇకపై దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెప్పారు.
252 జీవోతో జర్నలిస్టులు ఎదురొంటున్న సమస్యలపై ఐక్యకార్యాచరణ చేపట్టాలని నిర్ణయిస్తూ.. ప్రభుత్వంతో చర్చల ద్వారానే సమస్యకు పరిషారం రావాలని, లేనిపక్షంలో పోరాటమార్గాన్ని అనుసరిస్తామని వెల్లడించారు. జర్నలిస్టులకు అన్యాయం జరిగే ఈ జీవోను వెంటనే సవరించడంగానీ, కొత్త జీవో తేవడంగానీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. జర్నలిస్టులకు ఇండ్లస్థలాల సమస్యపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిషారానికి కృషిచేయాలని తీర్మానించినట్టు తెలిపారు. చిన్న పత్రికల ఎంప్యానల్మెంట్ సమస్య పరిషారం కోసం త్వరలోనే సమాచారశాఖ భవన్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ‘తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ ట్రస్ట్’ ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. వచ్చే మార్చిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ నిర్వహించి పూర్తిస్థాయి కమిటీ వేయనున్నామని, అప్పటివరకు మిగిలిన జిల్లాల్లో పూర్తిస్థాయి కమిటీలు వేసుకోవాలని అల్లం నారాయణ సూచించారు.
జర్నలిస్టు సంఘాలతో సంప్రదింపులు లేకుండానే జీవో..
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ మాట్లాడుతూ.. జర్నలిస్టు యూనియన్లతో సంప్రదింపులు జరుపకుండానే జీవో-252 విడుదల చేశారని ఆరోపించారు. గతంలో జీవో-239 రూపకల్పన సమయంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు డెస్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాజా జీవోలో ఆ స్ఫూర్తి లోపించిందని, వివిధ నిబంధనలతో సుమారు 13 వేల అక్రెడిటేషన్ కార్డులు రద్దయ్యే అవకాశం ఉన్నదని, ఇది జర్నలిస్టుల వృత్తి భద్రత, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపనున్నదని పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డుల దుర్వినియోగంపై కఠిన చర్యలు అవసరమేనని, అయితే అర్హులైన జర్నలిస్టులకు ఎలాంటి అన్యాయం జరుగకూడదని స్పష్టంచేశారు. ప్రధాన జర్నలిస్టు యూనియన్ల అభిప్రాయాలను పకనబెట్టి నిర్ణయాలు తీసుకోవడంతో మీడియా అకాడమీ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, కోశాధికారి యోగానంద్, టెంజూ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కార్యదర్శి రమణ, ఐజేయూ జాతీయ నాయకులు భాసర్, తిరుపతినాయక్, రాష్ట్ర నాయకులు గుండు ముత్తయ్యగౌడ్, సుధాకర్, లెనిన్, రాజ్‌నారాయణ, రాంగోపాల్, సుధాకర్, నవీన్‌కుమార్, అన్ని జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.