నర్సంపేట(ఖానాపురం), సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్ర సాధన మలిదశ ఉద్యమకారుడు, దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ నిర్మాణ గద్దెను గురువారం రాత్రి పోలీస్, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌కు చెందిన ఉద్యమకారులు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు ముందుకొచ్చి పెద్ది విగ్రహ ఏర్పాటుకు ఇటీవల గద్దె నిర్మాణం చేపట్టారు. మూడు రోజుల క్రితం నిర్మించిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో కూల్చివేయించింది. సిమెంట్ ఇటుకలు, సిమెంట్, డస్టును ట్రాక్టర్లలో పోలీసుల బందోబస్తు మధ్య తరలించారు.
ముందస్తు సమాచారం లేకుండా గద్దె కూల్చి వేయడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. శుక్రవారం ఉదయం ఆర్బీఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్‌రెడ్డి, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య గద్దె ప్రాంతాన్ని పరిశీలించారు. అశోక్‌నగర్‌లో ఖానాపురం సర్పంచ్ దాసరి రమేశ్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. నర్సంపేట-కొత్తగూడ ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొద్దిరోజల క్రితం నర్సంపేటలో, ఇప్పుడు అశోక్‌నగర్‌లో దొంగచాటుగా గద్దెలు తొలగించడం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మూర్ఖత్వాన్ని బయటపెట్టిందని విమర్శించారు.