హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాల ప్రారంభోత్సవం పలుచోట్ల రసాభాసగా మారింది. మండలానికో పైలట్ గ్రామంలో లబ్ధిదారులకు పథకాల మంజూరు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ రచ్చరచ్చ అయ్యింది. రాత్రికి రాత్రే జాబితాలు తయారుచేసి అర్హుల పేర్లు తొలగించారంటూ ప్రజానీకం మండిపడింది. అర్హులకు పథకాలు దక్కలేదంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. అనర్హులకు ఎలా పథకాలు కట్టబెడతారంటూ మండిపడ్డారు. ఉన్నోళ్లకే రెండేసి పథకాలు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు గ్రామపంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. తమకు అన్యాయం జరిగిందంటూ పలువురు మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు.