IDPL | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 12 (నమస్తే తెలంగాణ)/బాలానగర్: బాలానగర్ పారిశ్రామికవాడలో మూతపడిన ప్రభుత్వరంగ ఔషధాల కంపెనీ ఐడీపీఎల్‌కు చెందిన మిషనరీని కారుచౌకగా విక్రయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దాదాపు రూ.1,500 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మిషనరీని రూ.68 కోట్లకే ముంబైకి చెందిన కంపెనీకి కట్టబెట్టడం వెనుక భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిశ్రమలకు చెందిన మిషనరీలను విక్రయించడానికి కెమికల్ ఇంజినీరింగ్ నిపుణుల కమిటీని నియమించి, దాని సూచనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. అయితే, ఐడీపీఎల్ మిషనరీ అమ్మకంలో ఎలాంటి కమిటీలు, ప్రకటనలు లేకుండా ఆ తంతును రహస్యంగా నిర్వహించడంలో మతలబు ఏమిటని కార్మికసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐడీపీఎల్ మిషనరీ అమ్మకంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఐడీపీఎల్ విశ్రాంత ఉద్యోగులు కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వశాఖకు పోస్టుకార్డులు రాశారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక రంగం కుంటుపడుతున్నదని ఆరోపించారు.
ఓ వెలుగు వెలిగిన ఐడీపీఎల్
ఆసియాలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీగా ఐడీపీఎల్ పరిశ్రమ నాటి సోవియట్ యూనియన్ సహకారంతో 1961లో ఏర్పాటైంది. దీనిని బాలానగర్ పారిశ్రామికవాడలోని 891 ఎకరాల విస్తీర్ణంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో 7 వేల మంది కార్మికులు వివిధ షిప్టుల్లో పనిచేసేవారు. 302 ఎకరాల స్థలంలో కార్మికులకు అన్ని వసతులతో క్వార్టర్లు నిర్మించడం విశేషం. కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు 40కి పైగా బస్సులు నిత్యం రాకపోకలు సాగించేవి. తదనంతరం ఫార్మా విద్యను అందిస్తున్న నైపర్‌కు కేంద్రం ఐడీపీఎల్ స్థలం నుంచి 50 ఎకరాలు కేటాయించింది. నైపర్‌లో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఫార్మారంగం ఎదుగుదలకు దోహదపడుతున్నారు.
విలువైన మిషనరీ విలువ తక్కువగా అంచనా
ఐడీపీఎల్ పరిశ్రమలో రూ.1,500 కోట్ల విలువ చేసే మిషనరీ (గ్లాస్కెట్టిల్స్, సింక్రోనియస్ మోటర్లు, లేత్ మిషన్స్)తో పాటు ఇతర మిషనరీల ద్వారా మందుల ఉత్పత్తులు జరిగేవి. వీటితోపాటు ఆరు విలువైన మోటర్లు ఉన్నాయి. వాటి విలువ ఒక్కొక్కటి రూ.60-70 లక్షల వరకు ఉంటుంది. అత్యంత విలువైన 250 గ్లాస్కెటిల్స్ ఉన్నాయి. ఐడీపీఎల్‌లో తయారైన మందులను ప్రభుత్వ దవాఖానలకు, అన్ని మందుల షాపులకు సరఫరా చేసేవారు. ఐడీపీఎల్ మందులంటే అప్పట్లో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఈ మిషనరీ విలువను కేవలం రూ.70 కోట్లుగా నిర్ధారించడం, టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టి రూ.68 కోట్లకే అప్పగించడం చకచక జరిగిపోయాయని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదినుంచి ఈ వ్యవహారంపై అధికారులు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారు. టెండర్లను ఆన్లైన్లో ఆహ్వానించినప్పటికీ నోటిఫికేషన్లో మిషనరీ వివరాలను పొందుపరచలేదు. టెండరు పూర్తయిన వెంటనే నోటిఫికేషన్ సహా అన్ని వివరాలను ఐడీపీఎల్ అధికారిక వెబ్సైట్ నుంచి తొలగించడం అనుమానాలకు తావిస్తున్నదని కార్మికులు ఆరోపిస్తున్నాయి.
సమగ్ర విచారణ జరిపించాలి
మూతపడిన ఐడీపీఎల్‌లోని రూ.1,000 కోట్ల విలువైన తుక్కును రూ.68 కోట్లకే కట్టబెట్టడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ వ్యవహారంలో బీజేపీకి చెందిన ఓ జాతీయ నాయకుడి పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి.
–పాటిమీది జగన్మోహన్రావు, టీఎస్టీఎస్ చైర్మన్
నోడల్ ఏజెన్సీతో టెండర్ ఖరారు
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మిషనరీ విక్రయానికి బిడ్లు వేయడానికి టెండర్లను ఆహ్వానించాం. ఎంఎస్టీసీ లిమిటెడ్ సంస్థ నోడల్ ఏజన్సీగా వ్యవహరించింది. టెండర్లలో 33 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. ముంబైకి చెందిన ఈడీఎఫ్ఐసీఈ ఇంజినీరింగ్ సంస్థ టెండర్ వేలంలో మిషనరీని దక్కించుకున్నది. రూ.67.93 కోట్ల బిడ్తోపాటు జీఎస్టీ రూ.10.26 కోట్లు చెల్లించింది.
–ఐడీపీఎల్ జీఎం రామకృష్ణారెడ్డి