మధిర, ఆగస్టు 17: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కేవలం దళిత సామాజికవర్గానికే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ స్వేరోస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఆదివారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సెంటర్ వద్ద రాధాకృష్ణ దిష్టిబొమ్మను ప్రదర్శిస్తూ చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధిర నియోజకవర్గ స్వేరోస్ అధ్యక్షుడు సోమపోగు శ్యామ్‌కుమార్ మాట్లాడుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రవీణ్‌కుమార్‌ను దళిత నాయకుడంటూ అవమానకర పదజాలాన్ని వినియోగించడం సరికాదని అన్నారు.
ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్‌గా 26 ఏండ్లు దేశానికి ఎంతో సేవ చేశారని తెలిపారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారని, మేడిగడ్డపై ఆయన పెట్టిన ప్రెస్‌మీట్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కేవలం దళిత సామాజికవర్గానికే పరిమితం చేస్తూ మీడియాలో కథనాలు ప్రసారం చెప్పడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాధాకృష్ణ ప్రత్యక్షంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.