చార్మినార్, జూన్ 13: నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్‌పై జనం తిరగబడ్డారు. ఎమ్మెల్యే శుక్రవారం అనుచరులతో కలిసి మౌలా కా చిల్లా ప్రాంతంలో పర్యటించి అక్కడ జరుగుతున్న నాలా పనులను పరిశీలించారు. ఏండ్ల తరబడి పనులు జరుగుతుండటంతో వానొచ్చినప్పుడు వరదతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేను కలిసి నిలదీశారు. దీంతో కల్పించుకున్న ఆయన అనుచరులు స్థానికులపై తిరగబడ్డారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. ప్రజల తిరుగుబాటుతో ఏం చేయాలో తెలియని ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు.