Medak | రామాయంపేట/కోనరావుపేట/ చందుర్తి, మే 16: కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నాయని, ధాన్యం మొలకెత్తినా.. తూకం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడ్డారు. లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజులు గడుస్తున్నా.. కేంద్రాల్లోనే ఉండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా డీ-ధర్మారం, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట, చందుర్తి మండల రైతులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
గురువారం డీ-ధర్మారంలోని రామాయంపేట-గజ్వేల్ రహదారిపై రైతులు బైఠాయించి, మూడు గంటల పాటు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న రామాయంపేట పోలీసులు రైతులను సముదాయించి నిరసనను విరమింపజేశారు. కోనరావుపేటలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో రెండు గంటలపాటు వాహనాలు నిలిచిపోయాయి. చందుర్తి మండలం జోగాపూర్ రైతులు గ్రామపంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

వర్షాలకు ధాన్యం తడుస్తున్నదని, ఎండిన ధాన్యాన్ని కూడా తూకం వేయకుండా తాత్సారం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పు డూ ఇలా ఇబ్బంది పెట్టలేదని గుర్తుచేశారు. లారీల కొరతతో తూకం వేసిన బస్తాలు కేం ద్రాల్లో రోజుల తరబడి పేరుకుపోతున్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించాలని, లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.