భద్రాచలం, జూన్ 6: పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కాంట్రాక్టు కార్మికులు గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా దవాఖాన ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కే బ్రహ్మచారి మాట్లాడుతూ.. ఏరియా దవాఖానకు కొత్త కాంట్రాక్టర్ వచ్చినప్పటి నుంచి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఐదు నెలలుగా వేతనాలు లేకుండా ఎలా పని చేస్తారని ప్రశ్నించారు.
వేతనాల కోసం ఫిబ్రవరి నెలలో ధర్నా చేయగా.. దవాఖాన సూపరింటెండెంట్ రామకృష్ణ ద్వారా జీతాలు ఇప్పిస్తానని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదని చెప్పారు. వెంటనే వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా.. సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు ఆర్ఎంవో రాజశేఖర్‌రెడ్డితో చర్చలు జరిపారు. ఈ నెల 9న ఐదు నెలల జీతాలపై అధికారులతో మాట్లాడి కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 9న వేతనాలు తమ ఖాతాల్లో పడకపోతే 10వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ సూపరింటెండెంట్‌కు నోటీసు అందజేశారు.