పెంట్లవెల్లి/పెద్దకొడప్గల్, డిసెంబర్ 12 : సొంత నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపురంలో పర్యటించారు. స్థానికులనుద్దేశించి ప్రసంగిస్తుండగా కేసీఆర్ ప్రభుత్వంలో బీసీబంధు తీసుకున్న మహిళను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారని, మీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదంటూ జనం మండిపడ్డారు.
మంత్రి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అలాగే కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం బేగంపూర్తండాలో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావును స్థానికులు అడ్డుకున్నారు. కాస్లాబాద్, వడ్లం గ్రామాల్లో ప్రచారం అనంతరం ఎమ్మెల్యే బేగంపూర్తండాకు రాగా స్థానికులు అడ్డుకున్నారు. తండావాసులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. లక్ష్మీకాంతారావు యువకులపై దూసుకెళ్లగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.