హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నదని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య విమర్శించారు. ఈ బడ్జెట్ కేటాయింపులను తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌పై నిరసన వ్యక్తం చేసేందుకు ఈ నెల 10న హైదరాబాద్‌లోని ఇందిరాపార్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
ఈ ధర్నాలో ప్రజలు వేలాదిగా పాల్గొనాలని కోరారు. నిరుటి కంటే ఈసారి బడ్జెట్ పరిమాణం దాదాపు రూ.3 లక్షల కోట్లు పెరిగినప్పటికీ ద్రవ్యలోటును జీడీపీలో 4.4 శాతంగా చూపడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.