Banakacherla | హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం రూ. 80 వేలకోట్లతో నిర్మించతలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుపై ఏపీని, లోపాయికారిగా సహకరిస్తున్న కాంగ్రెస్ సర్కారును తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అడుగడుగునా నిలదీస్తున్నది.
విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర సర్కారు సైతం వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నది. అయితే తెలంగాణలోనే కాకుండానే ఏపీలోనూ ఈ ప్రాజెక్టుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆలోచనాపరులు, నీటిరంగ నిపుణులు టీడీపీ తీరును తూర్పారబడుతున్నారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టును చేపడుతున్నారని, ఇది రాష్ర్టానికి గుదిబండగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా సదస్సులు పెడుతూ, చర్చలు నిర్వహిస్తూ ప్ర జలను చైతన్యం చేస్తున్నారు. దీంతో తెలంగాణ పోరాటానికి మరింత బలం చేకూరుతున్నది.
గోదావరి మిగులు జలాలను కృష్ణా మీదుగా పెన్నా బేసిన్‌లోని రాయలసీమ ప్రాంతానికి తరలించి సాగు, తాగునీరు అందిస్తామని, పారిశ్రామిక అవసరాలను తీర్చుతామని, లింక్ ఏపీ రాష్ర్టానికి గేమ్ చేంజర్ అని ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టుపై ఏపీలోని మేధావులు, ఆలోచనాపరులు, విశ్రాం త ఇంజినీర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులు, నీటిపారుదల నిపుణులతో ఏర్పాటైన ఏపీ ఆలోచనపరుల వేదికకు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వం వహిస్తుండటం గమనార్హం.
ఈ వేదిక ప్రధానంగా నీటి నిర్వహణ, మౌలిక వసతులపై ఏపీ ప్రభుత్వం అనుసరించే విధానాలపై ఎప్పటికప్పుడు వేదిక గళమెత్తుతుంది. ప్రస్తుతం ఏపీ ప్రతిపాదించిన లింక్ ప్రా జెక్టు ఖర్చు, ఏపీ నీటి హకులపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నది. కేవలం కాంట్రాక్టర్ల కోసమే రూ.80 వేల కోట్లతో ఈ ప్రాజెక్టును రూపొందించారని, అది నిర్ణీత సమయానికి పూర్తిచేసినా దాని వ్యయం రూ.1.5 లక్షల కోట్ల కు చేరుకుంటుందని నొక్కిచెప్తున్నది.
ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని, భవిష్యత్తు తరాలకు భారంగా మారుతుందని వేదిక స్పష్టం గా చెప్పింది. గోదావరి నుంచి కృష్ణాలకు జలాలను మళ్లించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణానది జలాల్లో ప్రస్తుతమున్న వాటా హకు చాలా తీ వ్రంగా దెబ్బతింటుందని కూడా ఆందోళన వ్యక్తంచేసింది. ప్రాజెక్టు ప్రణాళిక, అమలుపై అ నేక సందేహాలను లేవనెత్తుతున్నది. అంతేకాదు ప్రాజెక్టు పత్రాలను బయపెట్టాలని, ఏపీ నీటి హక్కులను పరరిరక్షించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ వేదిక చంద్రబాబుకు లేఖలు రాయడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ చర్చపెడుతున్నది. ఏపీ ప్రజలను చైతన్య పరుస్తున్నది.
ఏపీ ప్రభుత్వం బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెరమీదకు తెచ్చింది మొదలు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో గులాబీ శ్రేణులు తమ గళా న్ని బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాజెక్టుపై విస్తృత చర్చకు తెరతీశారు. గోదావరిలో మిగులు జలాలనే ప్రస్తావనే లేదని నొక్కి చెప్పడంతోపాటు, ట్రిబ్యునల్ అవార్డుకు, విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టును చేపట్టడంపై నిప్పులు చెరుగుతున్నారు.
ప్రాజెక్టు వల్ల తెలంగాణకు గోదావరి జలాలే కాకుండా, కృష్ణా జలాలు కూడా దక్కకుండాపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు మరో పోరాటానికి సిద్ధమని ప్రకటించా రు. ప్రాజెక్టుపై దూకుడుగా ముందుకు సాగుతు న్న ఏపీని, మరోవైపు ఏకపక్షంగా మద్దతిస్తున్న కేంద్ర బీజేపీ సర్కారును, ఇంకోవైపు లోపాయికారిగా సహకరిస్తూ మౌనం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను అడుగడుగునా నిలదీస్తున్నా రు.
బీఆర్ ఎస్వీ నేతలు యూనివర్సిటీల్లో ప్రచారానికి తెరతీశారు. మరోవైపు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ సైతం ప్రాజెక్టుపై అభ్యంతరాల ను వ్యక్తంచేసింది. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే లింక్ ప్రాజెక్టు చేపట్టాలని తేల్చిచెప్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నీటివనరుల సలహాదారు వెదిరె శ్రీరాం సైతం లింక్ ప్రాజెక్టుపై అనేక అభ్యంతరాలను వ్యక్తంచేశారు. బీఆర్ఎస్, తెలంగాణ సమాజం ముప్పేట దాడితో కాంగ్రెస్ సర్కారు సైతం విధిలేని స్థితిలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామంటూ ప్రకటనలు చేస్తున్నది. లేఖరాస్తున్నది. అయితే మరోవైపు ఏపీతో చర్చిస్తామంటూ, కమిటీ ఏర్పాటుకు సైతం మొగ్గుచూపడమే అనేక అనుమానాలకు తావిస్తున్నది.
విజయవాడ మాజీ ఎంపీ, ఏపీ మాజీ మంత్రి, రైతుసంఘం నేత వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా పలు వేదికలపై ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రాజెక్టుతో ఏపీకి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువని తేల్చి చెప్తున్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఆలోచన అసమంజసమైనది, అసంబద్ధమైనదని అంటున్నారు. ఇప్పటికీ కృష్ణా నదిలో కొన్నిసార్లు 500 టీఎంసీలు, మరికొన్ని సార్లు వెయ్యి టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ జలాలను ఒడిసిపట్టి వినియోగించుకోవచ్చని చెప్తున్నారు. ఏపీ నీటిహక్కుల కార్యకర్త భవానీప్రసాద్ కూడా ప్రాజెక్టు అవసరమేంటని ఏపీ సర్కారును ప్రశ్నిస్తున్నారు.
ట్రిబ్యునల్ అవార్డు దృష్ట్యా ప్రస్తుత లింక్ ప్రాజెక్టు ఏపీకి చిక్కులు తేవడంతోపాటు, కృష్ణా జలాల్లో వాటా తగ్గించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఏపీలోని ఇతర అనేక ప్రజాసంఘాలు, మేధావి వర్గం సైతం పీబీ లింక్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మరోవైపు, ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు)ను సైతం కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ, కేంద్ర సంస్థలైన కృష్ణా, గోదావరి రివర్ బోర్డు లు, ఎన్డబ్ల్యూడీఏలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సైతం అనేక అభ్యంతరాలను వ్యక్తం చేయడంతోపాటు చట్టపరమైన అంశాలను లేవనెత్తడం గమనార్హం.