హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ).. ప్రస్తుతం ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకొంటున్న టెక్ ఆయుధం. చాట్‌జీపీటీతోనే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమైపోయింది. ప్రస్తుతం గ్రామాల్లోనూ ఏఐ వినియోగం పెరిగిపోయింది. ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్.. అనేక రంగాల్లో ఏఐ తిష్ట వేసుకొని కూర్చున్నది. దీనివల్ల రాబోయే కాలంలో పెద్దమొత్తంలో ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం అవుతున్నది. అయితే, దానితో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఐటీ నిపుణులు చెప్తున్నారు. ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌తో కొత్త ఉద్యోగాలు పుడతాయని అంటున్నారు.
ఏఐ టెక్నాలజీతో కంప్యూటర్ యంత్రాలే మనుషుల్లా పనిచేసే స్థాయికి చేరుకున్నాయి. అయితే ఇక్కడ కంప్యూటర్ యంత్రాలు సరైన విధంగా స్పందించాలంటే, ఏదైనా ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్.. యంత్రానికి సరిగా అర్థం కావాలి. మనం ఇచ్చిన ఇన్పుట్కు తిరిగి మనకు కావాల్సిన ఇన్పుట్ను కంప్యూటర్ ఇస్తే అదే ప్రాంప్ట్ ఇంజినీరింగ్. సింపుల్‌గా చెప్పాలంటే మనం ఒక విషయం గురించి అడిగితే కచ్చితంగా ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని కంప్యూటర్ ఇచ్చిందంటే అది ప్రాంప్ట్ ఇంజినీర్ ఇచ్చిన ఇన్పుట్స్ వల్లేనని అర్థం చేసుకోవాలి.
ఏఐతో మానవాళికే ప్రమాదమని ఎంతో మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా, ఏఐలో నిరంతరం పరిశోధనలు, కొత్తగా ప్రాజెక్టులు వస్తూనే ఉన్నాయి. చాట్‌జీపీటీ అందుబాటులోకి రాగానే, గూగుల్ యుద్ధ ప్రాతిపదికన బార్డ్ ఉచిత వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఆ తర్వాత పెయిడ్ వెర్షన్లలో జెమినీ ఏఐ(అల్ట్రా, ప్రో, నానో)ని తీసుకొచ్చింది. మెటా సైతం ఏఐతో అప్లికేషన్‌ను ప్రకటించింది. ఇలా ప్రముఖ కంపెనీలు ఏఐ ప్రాజెక్టులను రూపొందిస్తూనే ఉన్నాయి. ప్రతి సంస్థ చాట్బోట్లను తమ వెబ్సైట్లలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మనుషుల స్థానంలో ఇప్పుడవే స్పందిస్తూ సమాధానాలు ఇస్తున్నాయి. ఇలా రోజురోజుకు ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుండటంతో ప్రాంప్ట్ ఇంజినీర్ల అవసరం కంపెనీలకు ఉంటుంది. దీనిపై విసృత్తంగా శిక్షణ కార్యక్రమాలు ఒకవైపు, నియామకాలు మరోవైపు జరుగుతూనే ఉన్నాయి.
ఏఐ వినియోగం రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండటంతో సాప్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నా, ప్రాంప్ట్ ఇంజినీర్లకు ఉద్యోగాకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సాప్ట్వేర్ కంపెనీ ఏదైనా సరే ఎక్కడో ఒక చోట ఏఐని తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా చిన్న కంపెనీల నుంచి మొదలు కొని పెద్ద కంపెనీల వరకు ప్రాంప్ట్ ఇంజినీర్లను ఉద్యోగాల్లో చేర్చుకుంటాయి. ఏదైనా డిగ్రీ ఉండి, ఏఐపై పూర్తి స్థాయిలో పరిజ్ఞానం ఉండాలి. కంపెనీలు ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలు ఉన్నాయి.
– పద్మరాజు, ఐటీ నిపుణుడు