హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యుత్ సంస్థలైన ట్రాన్స్ కో, జెన్ కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో ఏడాదిన్నర కాలం పాటు ప్రమోషన్లు నిలిపివేశారని, వెంటనే పదోన్నతులు కల్పించాలని బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కోడెపాక కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. జేఏసీ నేతలతో కలిసి ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీని బుధవారం ప్రత్యేకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రత్యక్ష నియామకాల ద్వారా ఫీడర్ పోస్టుల్లో ఎంపికైన ఉద్యోగుల సీనియార్టీని మెరిట్ ప్రాతిపదికన నిర్ధారించి ప్రకటించకపోవడం మూలంగానే విద్యుత్‌సంస్థల్లో పదోన్నతులు నిలిచిపోయాయనని వివరించారు. దీంతో వేలాది ఉద్యోగులు నష్టపోతున్నారని వాపోయారు. పదోన్నతుల విషయమై సీఎండీ సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. సీఎండీని కలిసిన వారిలో కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, వైస్‌చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కో కన్వీనర్ భానుప్రకాశ్, విజయకుమార్ తదితర నాయకులు ఉన్నారు.