నాకు ఓట్లేయండి.. మీ అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తా.. ఇంటికి జత ఎడ్లు ఇస్తా !’ ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ నేత రైతులకు ఇచ్చిన హామీ ఇది! ఆ తర్వాత ఆయన ప్రజా ప్రతినిధి అయ్యారు.. ఇప్పుడు మరో మెట్టెక్కి హస్తినదాకా ఎదిగారు. అయినా.. రైతులకు ఇచ్చిన హామీని మరిచిపోలేదు. రికార్డుల్లో లావణి పట్టాగా వచ్చే భూములు పట్టాగా మారిపోయాయి. కాకపోతే ఆ భూములు ఇప్పుడు రైతుల పేరిట లేవు!
కొన్ని నాటకీయ పరిణామాలతో చివరికి రైతుల భూములు సదరు ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల పేరు మీదికొచ్చాయి. నిన్నటిదాకా పడావు పడిన ఆ భూములకు మాగాణి కళ వచ్చింది.. భూముల్లో ఉన్న ఓ చెరువు ఏకంగా కాలగర్భంలోనే కలిసిపోయింది.. వీటికి మించి ప్రభుత్వ భూమి కూడా తోడై వందెకరాలకు పైగా విస్తీర్ణంలో వ్యవసాయ క్షేత్రం వెలసింది. సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదరపల్లిలోని సర్వే నంబరు 294లోని భూముల కథ ఇది!
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్.. ఇప్పటి సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం చౌదర్పల్లి పరిధిలోని సర్వే నంబర్ 294లో 178.06 ఎకరాల భూమి ఉన్నది. 1952-53 రెవెన్యూ పహాణీ రిజిస్టర్ ప్రకారం ఇది రక్బ. ఇందులో మొదటి మూడు నంబర్లు.. 294/1లో 9.04 ఎకరాలు, 294/2లో 7.28 ఎకరాలు, 294/3లో 34.20 ఎకరాలు.. అంటే మొత్తం 51.12 ఎకరాల భూమి ఖరీజ్ ఖాతాగా నమోదై ఉన్నది. మిగిలిన 294/4 నుంచి 294/10 వరకు ఉన్న డివిజన్ సర్వే నంబర్లలో 126.28 ఎకరాలు (294/4- 17.27 ఎకరాలు, 294/5- 8.24 ఎకరాలు, 294/6- 1.23 ఎకరాలు, 294/7- 19.26 ఎకరాలు, 294/8-16.24 ఎకరాలు, 294/9-11.12 ఎకరాలు, 294/10- 51.36 ఎకరాలు) విస్తీర్ణం నమోదై ఉన్నది. ఇందులో 294/8, 294/9, 294/10 సర్వేనంబర్లలో కొంత భూమిని 1973-74 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులాల నిరుపేదలకు అసైన్డ్ చేసిందని భూమిలో కాస్తు చేసుకుంటున్న రైతులు చెప్తున్నారు. వాస్తవానికి ఇందుకు అనుగుణంగానే గతంలో రికార్డులున్నా.. చాకచక్యంగా వాటిని మాయం చేసి తారుమారు చేశారు. వీటికి సంబంధించిన రికార్డులు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నా నామమాత్రంగా కొన్ని రికార్డులిచ్చి, అసలు రికార్డులను మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం.
ఎన్నికల ఎజెండాగా భూ సమస్య
1955-58 సెస్సాల ప్రకారం 294 సర్వేనంబర్‌లో 178.06 ఎకరాల రక్బా (పాతది) ఉన్నది. కానీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 187.05 ఎకరాలుగా నమోదైంది. ఈ లెక్కన సుమారు 9ఎకరాల విస్తీర్ణం ఎక్కువ నమోదైంది. ధరణి చట్టం కంటే ముందు ఉన్న రెవెన్యూ నిబంధనల ప్రకారం రక్బా కన్నా నమోదు మొత్తం ఎక్కువ ఉంటే మ్యుటేషన్ చేయొద్దు. ఈ సర్వే నంబర్లో ఎక్కువశాతం ప్రభుత్వ భూమిగా ఉన్నది. ఈ కారణంతోనే రెవెన్యూ అధికారులు భూ మార్పిడి దరఖాస్తులను తిరస్కరించారు. ఆ మండలంలో పని చేసిన ప్రతి ఒక్క అధికారికి, ఆ గ్రామ రెవెన్యూ రికార్డులు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ విషయం తెలుసు. దీంతో 15 ఏండ్ల నుంచి ఈ భూ ముల్లో క్రయ విక్రయాలు జరగలేదు. ఖరీజ్ ఖాతాగా ఉన్న 294/1,2,3తో పాటు పేద రైతులకు అసైన్డ్ చేసిన (రికార్డులు మాయం చేశారు) 294/8, 294/9, 294/10 సర్వే నంబర్లకు సంబంధించి జారీ అయిన డిజిటల్ పాస్ పుస్తకాల్లో స్పష్టంగా లావణి పట్టా అని ఉన్నది. అయితే ఈ భూములపై క్రయ, విక్రయాలు జరగకపోవడంతో రైతులు అవసరాలకు తమ భూమిని అమ్ముకోవాలన్నా కుదరడం లేదు.
హక్కులు కల్పిస్తానని హామీ ఇచ్చి
2020లో దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు రైతులు ఇదే అదునుగా తమ భూములపై నిషేధంగా ఉన్న క్రయ విక్రయాల సమస్య పరిష్కరించాలని పోటీ చేసిన ప్రతి అభ్యర్థినీ కోరారు. ఇందులో భాగంగా సదరు నేత లావణి పట్టా భూములపై పూర్తిస్థాయి హక్కులు కల్పించి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడంతో రైతులు నమ్మారు. అంతేకాదు.. ఇంటికి జత ఎడ్లు కూడా ఇస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన సదరు ప్రజాప్రతినిధి తమ సమస్యను పరిష్కరిస్తారని 60 మంది రైతులు ఆశగా ఆయన చుట్టూ తిరిగారు. ఎన్నికల హామీ మేరకు లావణి పట్టా భూములపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కల్పించి, ఎవరి భూమి ఎక్కడ ఉన్నదో చూపాలని ప్రాధేయపడ్డారు. ఇంటికి జత ఎడ్లు కూడా ఇప్పిస్తే వ్యవసాయం చేసుకుంటామని వేడుకున్నారు. పరిష్కారం చూపాల్సిన ఆయన.. గుంభనంగా ఉంటూ అంశంపై లోతుగా అధ్యయనం మొదలు పెట్టినట్టు తెలిసింది. ఇదే విషయంపై అప్పట్లో అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ‘ఇంటికి రెండు ఎడ్లతో పాటు అసైన్డ్ భూములపై రైతులకు హక్కు కల్పిస్తానన్న హామీలేమయ్యాయి?’ అని సదరు ప్రజాప్రతినిధిని ప్రశ్నించడాన్ని పలువురు రైతులు గుర్తుచేస్తున్నారు.
పరిష్కారం వదిలి భూములపైనే కన్ను
రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన సదరు ప్రజాప్రతినిధి కన్ను ఆ భూములపై పడింది. రెవెన్యూ అధికారులతో పలు దఫాలుగా చర్చించి ఆ భూముల లోతుపాతులపై పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. కొద్దికాలం మౌనంగా ఉండి తర్వాత నెమ్మదిగా తన అనుచరులను రంగంలోకి దింపారు. చౌదరిపల్లి, ఇనుగుర్తి పరిధుల్లోని లావణి పట్టా భూముల సమస్య పరిష్కారం కావడం అసాధ్యమని గ్రా మాల్లో ప్రచారం చేశారు. ముఖ్యంగా అప్పట్లో మిషన్ కాకతీయ పథకాన్ని ఉదహరిస్తూ ఈ భూముల్లో ఏటోనికుంట ఉన్నందున దాని పునరుద్ధరణ కింద ప్రభుత్వమే భూములను తీసుకోనున్నదనే తప్పుడు ప్రచారం వ్యాప్తిచేశారు. ఈ ప్రచారంతో ఆందోళన చెందిన రైతులు ఆ ప్రజాప్రతినిధిని కలిసి మొరపెట్టుకోగా ‘బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం’ అని మరింత భయాందోళనకు గురిచేసినట్టు ఓ రై తు అప్పట్లో జరిగిన విషయాన్ని వివరించాడు.
నోటరీ కాయితాలపైనే వ్యవహారం..
రైతుల భూములపై కన్నేసిన ఆ ప్రజాప్రతినిధి నేరుగా తాను స్వాధీనం చేసుకుంటే ప్రజాక్షేత్రంలో బదనాం అవుతాననే కారణంగా ముందు తన అనుచరులతో వాటిని కొనుగోలు చేయించారు. తెర మీద ఎక్కడా కనిపించకుండా ఆయన అనుచరులే క్షేత్రస్థాయిలో రైతులను సంప్రదించి.. అడ్డికి పావుశేరులా ఆ భూములను కొనుగోలు చేశారు. ఎలాగూ లావణి పట్టా సమస్య పరిష్కారం కాదు కాబట్టి వచ్చినంత తీసుకొని పక్కకుపోదామనే ధోరణిలో రైతులు భూములను అమ్ముకున్నారు. అప్పటివరకు ఆ భూములపై అధికారికంగా క్రయ, విక్రయాలు జరగకపోవడంతో ముందుగా ప్రైవేట్ ఒప్పందాలు చేసుకున్నారు. ఇందుకు ‘నమస్తే తెలంగాణ’కు లభించిన ఓ డాక్యుమెంటే సాక్ష్యం! వాస్తవానికి వల్లెపు యాదయ్య, వల్లెపు మల్లయ్య, వల్లెపు లక్ష్మయ్య, వడ్డె రాజవ్వ, వడ్డె రామయ్యకు చెందిన 6.33 ఎకరాల భూమిని సదరు ప్రజాప్రతినిధి అనుచరుడొకరు కొనుగోలు చేసినట్టు ఒప్పంద పత్రం రాసుకున్నారు.
దానికి రైతుల ధరణి పాస్ పుస్తకాల ప్రతులను కూడా జత చేశారు. కానీ ఆ పాస్ పుస్తకాల్లో లావణి పట్టా అని స్పష్టంగా ఉన్నది. లావణి పట్టా భూముల కొనుగోలుకు ఒప్పందం చట్టప్రకారం నేరం. దీన్ని అదునుగా చేసుకొని అక్కడ మార్కెట్ ధర రూ.30 లక్షలకు పైగా ఉంటే ఒప్పందం ప్రకారం కేవలం రూ.3 లక్షల నుంచి రూ.7.50 లక్షలకే కొన్నారు. ఇక్కడ అత్యంత కీలకమైన విషయమేమిటంటే సదరు అనుచరుడు కొనుగోలు చేసిన సమయంలో పాస్ పుస్తకాల్లో లావణి పట్టాగా ఉన్న భూమి.. అనుచరుడి నుంచి ఆ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లే సరికి పట్టా భూమిగా మారింది. ఒకవేళ రికార్డుల్లో సాంకేతికంగా తప్పు జరిగిందని వాళ్లు దబాయించే అవకాశం ఉన్నదనుకుందాం! ఈ నేపథ్యంలో ఆ సమస్య ఉన్నదనే కదా రైతులు ఎన్నికల సమయంలో ఆనేత చుట్టూ ప్రదక్షిణ చేసి భరోసా తీసుకున్నది? మరి సమస్య పరిష్కరించి రైతులకు న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధి.. సమస్య పరిష్కారమయ్యేసరికి భూమి తన ఖాతాలో వేసుకోవడమంటేనే ‘దాల్మే కుచ్ కాలాహై’ అనే కదా?! ఇలా చౌదరిపల్లి రైతుల నుంచి సుమారు 72 ఎకరాల వరకు కొనుగోలు చేసినట్టు తెలిసింది.
అరుదైన ఒప్పంద పత్రం
సాధారణంగా ఒక వ్యక్తి పేరు మీద రికార్డుల్లో ఉన్న భూమిని మరో వ్యక్తి కొనుగోలు చేస్తారు. కానీ సదరు వ్యక్తి పేరు మీద లేకున్నా ఎక్కువ కబ్జాలో ఉన్న భూమిని కూడా కొనుగోలు చేస్తున్నట్టు ఒప్పంద పత్రం రాసుకోవడం అరుదే! పైగా ఒక ప్రజాప్రతినిధి! అం దునా చట్టాలన్నింటినీ తూర్పారబట్టిన వ్యక్తి అయి ఉండీ ఇలా చేయడమంటే ఆయనను సూటిగా ‘చెప్పేందుకేనా నీతులు?’ అని ప్రశ్నించవచ్చన్నమాట! నిరుడు జూన్‌లో ఒప్పంద పత్రాన్ని రాసుకున్నారు. సర్వే నంబర్ 294లో మేము (అంటే రైతులు) రికార్డుల్లో ఉన్నదాని కంటే ఎక్కువ విస్తీర్ణంలో కబ్జాలో ఉన్నందున ఆ కబ్జాకు సంబంధించి భూమికి అక్షరాలా పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి కబ్జాను బదిలీ చేసుకుంటున్నామనేది ఒప్పంద సారాంశం.
అయితే విశ్వసనీయ సమాచారం మేరకు రైతులు తమ పేరిట ఉన్న దాన్నే అమ్ముకున్నారు. కానీ సదరు ప్రజాప్రతినిధి ఆ విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న భూమిని తన స్వాధీనంలోకి తీసుకొని చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు తాము అమ్మినదాని కంటే ఎక్కువ కబ్జాలో ఉన్నావు కదా అని ప్రశ్నించడంతో కబ్జా విషయం ఎక్కడ బయటికి పొక్కుతుందోనన్న భయంతో వాళ్ల నోర్లు మూయించేందుకు వాళ్లే కబ్జా చేసిన భూమిని తాను బదిలీ చేసుకున్నట్టుగా ఒప్పంద పత్రం రాసుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వాస్తవానికి ఈ సర్వే నంబరులో 51 ఎకరాల ఖారీజ్ ఖాతా (సర్కారు భూమి) ఉన్నది. సదరు ప్రజాప్రతినిధి పరిధిలోకి వచ్చిన కబ్జాతో సర్కారు భూమికే గండి పడిందనేది బహిరంగ రహస్యం. అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తేనే సదరు ప్రజాప్రతినిధి నిబంధనలకు విరుద్ధంగా లావణి భూముల్ని కొనుగోలు చేయడంతో పాటు ప్రభుత్వ భూమిని ఎంత కబ్జా చేశారనే వాస్తవాలు బయటకొస్తాయి.
ఒక కుంటను ముంచి.. మరో కుంటను తుంచి
సదరు ప్రజాప్రతినిధి అద్భుతంగా నిర్మించుకున్న వ్యవసాయ క్షేత్రంలో రెండు నీటి వనరులు కూడా మౌనంగా బలైపోయాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రాను ఆ ప్రజాప్రతినిధి పార్టీ ‘జాతీయ వైరం’ కారణంగా తీవ్రంగా వ్యతిరేకించింది. కానీ ఈయనగారు మాత్రం పేరుకు ప్రతిపక్ష పార్టీలో ఉండి హైడ్రాకు జైకొట్టడమే కాకుండా హైడ్రాకు వ్యతిరేకంగా హైకోర్టు వ్యాఖ్యానిస్తే న్యాయస్థానాన్ని సైతం తప్పుపట్టే రీతిలో మాట్లాడటం అప్పట్లో తెలంగాణ సమాజాన్ని నివ్వెరపరిచింది. కాకపోతే ఈ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలిస్తే మాత్రం ఆయన హైడ్రాకు జై కొట్టడంలో, హైడ్రాతో నీటి వనరులు బాగుపడతాయంటూ ప్రశంసించడంలో అసలు మతలబు ఏమిటో అర్థమవుతుంది. ఏటోని కుంట పరిస్థితి ఎలా ఉన్నదోనని ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధి ఇటీవల వెళ్లి చూసినప్పుడు రెండు 200 సీసీ బుల్డోజర్లతో చెరువులోంచి మట్టిని అక్రమంగా తవ్వి, టిప్పర్లతో క్షేత్రంలోని ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారు.
దేవుని గుట్టనూ వదలని మహా భక్తుడు
ఈ వ్యవసాయ క్షేత్రానికి ఆనుకొని ప్రసిద్ధ దుబ్బ రాజేశ్వరస్వామి గుట్ట ఉన్నది. దాని పైన ఉన్న ఆలయంలో ఏటా ఉత్సవాలు జరుగుతాయి. గ్రామస్థులు గుట్ట మీదకు ఎదుర్కోళ్లకు పోతారు. ఇప్పుడు సదరు ప్రజాప్రతినిధి తన క్షేత్రానికి గుట్ట అడ్డం అని భావించారో? లేక అది చదును చేస్తే మరో ఐదారెకరాలు కలిసొస్తుందనుకున్నారో? గాని బుల్డోజర్లతో ఆగుట్టను కూడా తొలుస్తున్నారు. దీంతో ఇనుగుర్తి, చౌదరపల్లి గ్రామస్థులు వెళ్లి అడ్డుకోవడంతో ప్రస్తుతానికి ఆ పనులు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధి వ్యవహారంపై న్యాయవాది ఒకరు జిల్లా కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.