ఈ ప్రభుత్వానికి ఒక చట్టం లేదు. ఒక నిబంధన లేదు. ఒక విధానం లేదు. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుల పట్ల కనీస గౌరవం లేదు. ఆఖరుకు పౌరునికి తన వాదన వినిపించుకునే సమయం కూడా లేదు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా.. ఏ ఒక్క వాదనా వినకుండా..ఏ చట్ట ప్రక్రియనూ పాటించకుండా అర్ధరాత్రి.. తెల్లవారు జామున..దానితోపాటు శని, ఆది వంటి కోర్టులకు సెలవులుండే రోజుల్లో.. ఏదో శత్రుదేశం మీద జరిపినట్టు దాడులు, ధ్వంసాలు. కనీసం ఇంట్లోని విలువైన లేదా అవసరమైన వస్తువులు కూడా తీసుకునే వ్యవధి ఇవ్వకుండా కూల్చివేతలు.
అక్రమాలని ఎవరు నిర్ధారించారు? ఏ పద్ధతి పాటించారు? తెలియదు.. నిర్మించిన వారి వాదన ఏమిటి? తెలియదు.. మరి అలాంటి స్థలంలో ఎలా అనుమతులిచ్చారు? తెలియదు.. ఇంటి నంబరు, విద్యుత్తు, మంచినీరు, రహదారి తదితర పౌర సౌకర్యాలు ఎలా కల్పించారు? తెలియదు. ఒకే స్థలంలో ఒక భవనం కూల్చి పక్కనే మరో భవనాన్ని మాత్రం ఎందుకు ముట్టుకోవడం లేదో అంతకన్నా తెలియదు.
అక్రమ నిర్మాణమైతే నిరభ్యంతరంగా కూల్చేయండి. తప్పు లేదు. కానీ భారత రాజ్యాంగం, చట్ట సభలు ఇందుకోసం కొన్ని చట్టాలు రూపొందించాయి. వాటిని పాటించాలి. నోటీసులివ్వాలి. వాదనలు వినాలి. తగినంత సమయం ఇచ్చి తర్వాత కూల్చివేతలు మొదలు పెట్టాలి. అంతేగాని రాత్రికి రాత్రి పిండారీలు మీద పడట్టు ఈ దాడులేమిటి? రజాకార్లు ఊరిమీద పడట్టు ఈ భయోత్పాతం సృష్టించడమేమిటి? ఆ భవనాలేం రాత్రికి రాత్రి ఎక్కడికన్నా పారిపోతాయా?! వాటిని నిర్మించిన వారు ఎక్కడికైనా ఎత్తుకుపోతారా? కోర్టుకు పోయే అవకాశం కూడా ఇవ్వకుండా ఈ చీకటి దాడులేమిటి?
కూల్చివేతల్లో ఒక్క కాంగ్రెస్ నేత భవనమూ ఎందుకు లేదు? ప్రత్యర్థి పార్టీ నేతలే టార్గెట్‌గా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి, ప్రత్యర్థులను టెర్రరైజ్ చేయడానికి ‘ఏలినవారు కోరిన కోర్కెలు’ తీర్చని వారిపై కక్ష తీర్చుకోవడానికి ప్రభుత్వం ఉత్తరాదిలోని బుల్డోజర్ రాజకీయం ఎంచుకుందా? దీని వెనక ఉన్న ఎత్తుగడ ఏమిటి? ప్రభుత్వం గమనించిందో లేదో ఇలాంటి కూల్చివేతల మీద ఈ మధ్యే ఒక కోర్టు ‘20 ఏండ్ల క్రితం కట్టిన భవనానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చి, పౌరసౌకర్యాలన్నీ కల్పించి, పన్నులు కూడా వసూలు చేసుకొని ఇప్పుడు హఠాత్తుగా అక్రమ కట్టడమని కూలుస్తామంటారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఒక రాజ్యాంగం ఉంది. దాన్ని ప్రభుత్వం, దాని తాలూకు కూల్చివేతల బ్రిగేడ్లు గమనించాలి! రాష్ట్రం ఎవరి జాగీరు కాదు!
కొత్త టేపులు తెచ్చి కొల్చుకోండి.. నా ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్లోనో, బఫర్ జోన్‌లోనో ఉంటే కూల్చుకోండి.. ఇదీ ఓ మంత్రి గారు విసిరిన సవాల్ జలాశయం పక్కనే ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న మంత్రి ఇంత ధాటిగా ఎలా మాట్లాడారు అని ఆరా తీస్తే.. లోపలెక్కడో దాచిపెట్టిన మెమో ఎవరికి తెలుస్తుందిలే అన్న ధైర్యమే ఆ మాటల వెనుక ఉన్నదని బయటపడింది.
కానీ,దాచిపెట్టిన మెమోను నమస్తే తెలంగాణ జనం ముందుకు తెస్తున్నది. హైదరాబాద్ జంట జలాశయాల పరిధిలో నిర్మాణాలకైనా, కూల్చివేతలకైనా ప్రాతిపదిక ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కానే కావు. ఎఫ్టీల్నుంచి 500 మీటర్ల దూరం అంటే అక్షరాల అరకిలోమీటరు వరకూ నిషిద్ధ ప్రాంతం. అక్కడ ఎలాంటి కట్టడాలూ కట్టకూడదు. కడితే కూల్చిపారేయాలి. ఇది 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించి మరీ తెచ్చిన మెమో (261/I1/2006, Dt.16.7.2007) సారాంశం.
మరోవైపు భవన నిర్మాణ అనుమతుల కోసం 7.4.2012న కాంగ్రెస్ ప్రభుత్వమే 19 జీవోలను మేళవించి కొత్తగా 168 జీవోను ఇచ్చింది. దీని ప్రకారం ఎఫ్టీఎల్ నుంచి 100 మీటర్ల పరిధిని రిక్రియేషన్ జోన్‌గా పరిగణించింది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు.
మరి మీరే చూడండి. కింది ఫొటోల్లో కనిపిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇల్లు (1వ ఫొటో), ఎమ్మెల్యే వివేక్ ఫామ్‌హౌస్ (2వ ఫొటో) జలాశయానికి 100 మీటర్ల దూరం పైబడి ఉన్నాయా? కనీసం అర కిలోమీటర్ దూరం పైబడి ఉన్నాయా? ఉన్నట్టు మీకు అనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయా?
Telangana | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం (ఎఫ్టీఎల్) నుంచి అర కిలోమీటరు వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జారీచేసిన మెమోలో ఉన్న కీలకమైన నిబంధన ఇది. ఈ రూల్‌ను ఏదో ఆషామాషీగా తీసుకురాలేదు. ఈపీటీఆర్ఐ, ఐఐసీటీ, ఎన్జీఆర్ఐ వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలతో వివిధ శాఖల ఇంజినీర్లు కలిసి ఏకంగా రెండేండ్లపాటు లోతైన అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిబంధనలను తీసుకొచ్చారు. కూల్చివేతలకు కారణమేంటని హైడ్రా అధికారులను అడిగితే, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఈ నిర్మాణాలు ఉన్నాయని చెప్తున్నారు. 2007 మెమో ప్రకారం ఎఫ్టీఎల్ నుంచి అర కిలోమీటరు వరకు ఉన్న నిర్మాణాలను కూడా కూలగొట్టాలి కదా! అని మీకు సందేహం కలుగుతుంది కదూ.. ఇక్కడే అసలు మతలబు దాగి ఉంది. జంట జలాశయాలకు సంబంధించి 2007 నాటి అత్యంత కీలకమైన నిబంధనలు ఉన్న అంతర్గత ఉత్తర్వులను జలమండలి అధికారులే తొక్కి పెడుతున్నారు. కొందరు ‘ఇది మాకు తెల్వదే’ అంటున్నారు. కానీ ‘నమస్తే తెలంగాణ’ చేతికి 2007లో జారీ చేసిన మెమో (మెమో నెంబర్ 261/ఐ1/2006, తేది: 16.07.2007) చిక్కింది. దీంతో ఇందులోని అసలు విషయం బయటికొచ్చింది. జం ట జలాశయాల పరిరక్షణ కోసం ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు మాత్రమే కాదు నిషేధిత జోన్, ఆంక్షల జోన్ కూడా ఉన్నట్టు ఈ మెమో ద్వా రా బయటపడింది. మరి, జలాశయాల పరిరక్షణకు కేవలం ఎఫ్టీఎల్ను మాత్రమే పర్యవేక్షిస్తామంటే అదెలా సమంజసం అవుతుంది? అన్ని జోన్లలో నిబంధనలు ఉండాలి కదా!
మేకపోతు గాంబీర్యం అందుకే!
ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చేస్తుండటం.. 2007 నాటి మెమోను జలమండలి అధికారులు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతుండటంతో.. బఫర్, నిషేధిత, ఆంక్షల జోన్లో నిర్మాణాలు ఉన్నవాళ్లు ఎలాంటి భయంలేకుండా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మెమో ఎలాగూ బయటకు రాదన్న ధీమాతో ‘కొత్త టేపులు కొనుగోలు చేసి తెచ్చుకోండి… కొలుచుకోండి’ అంటూ మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే, గత కాంగ్రెస్ ప్రభుత్వమే రూపొందించిన ‘అర కిలోమీటరు’ నిబంధన అమలు మెమో వెలుగుచూడటంతో ఇక ఎలాంటి టేపులు ఇప్పుడు అవసరం లేదని తేలిపోయింది.
గత ప్రభుత్వాలు ఏమేం చేశాయి?
హైదరాబాద్ ఎగువన నగర శివారులోని హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరిరక్షణపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటుచేసిన హైడ్రా ఇప్పటికే ఎఫ్టీఎల్ పరిధిలో తాము గుర్తించిన మేరకు కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దీంతో ఇప్పుడు జలాశయాల చుట్టూ అసలు నిర్మాణాలు ఎంత పరిధిలో ఉండటం అక్రమం? ఏ పరిధి దాటిన తర్వాత ఎంత వరకు ఉండవచ్చు? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జంట జలాశయాల పరిరక్షణకు ఉమ్మడి రాష్ట్రంలో గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అనేకసార్లు అధ్యయనాలు చేయించి ఎప్పటికప్పుడు కఠినమైన నిబంధనలు అమలులోకి తెచ్చాయి. ఈ మేరకు జీవోలు, మెమోలు కూడా జారీ అయ్యాయి.
1989లో చెక్‌డ్యాంల తొలగింపు
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఇప్పుడంటే మంజీరా, కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులో వచ్చాయి. అయితే, అప్పట్లో హైదరాబాదీల తాగునీటికి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జంట జలాశయాలే శరణ్యంగా ఉండేవి. ఈ క్రమం లో ఈ జలాశయాల్లో నీటి నిల్వలు ఎప్పుడూ నిండుగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో ఈ జలాశయాలకు ఎగువ నుంచి వర ద వచ్చేందుకు ఎగువ ప్రాంతాల్లో చెక్‌డ్యాంలు కట్టకుండా 1989లో జీవో 50ని తీసుకొచ్చారు. అనధికారికంగా నిర్మించిన చెక్‌డ్యాంలను తొలగించాలనేది ఈ జీవో ముఖ్యోద్దేశం.
1994లో కాలుష్య నివారణకు జీవో
నగరీకరణ నేపథ్యంలో జంట జలాశయాల చుట్టూ నివాసాలు భారీగా పెరిగాయి. దీంతో జంట జలాశయాల నీరు కలుషితం కావడం మొదలైంది. ఈ క్రమంలో జలాశయాల్లోని నీటి వనరులు కలుషితం కావొద్దన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం అధ్యయనం కోసం 1993లో ఓ నిపుణుల కమిటీని నియమించింది. ఏడాదిపాటు సుదీర్ఘ అధ్యయనం చేసిన ఆ కమిటీ ప్రభుత్వానికి ఓ మధ్యంతర నివేదిక ఇచ్చింది. నివేదికలోని అంశాలను బట్టి అప్పటి సర్కారు 31.3.1994న జీవో 192ను జారీ చేసింది. జంట జలాశయాల ఎఫ్టీఎల్కు 10 కిలోమీటర్ల వ్యాసంలోని పరీవాహక ప్రాంతంలో ఎలాంటి కాలుష్యకారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలతో పాటు కాలుష్యకారకాలైన కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆ జీవోలో నిబంధనలను తీసుకొచ్చింది. ఏమైనా నిర్మాణాలు చేపట్టాలనుకుంటే కచ్చితంగా జలమండలి, పీసీబీ, డీటీసీపీ, హుడా, పరిశ్రమల శాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలని ఆ జీవోలో సూచించారు.
1996లో 84 గ్రామాలపై ఆంక్షలు
జలాశయాల్లో నీటి వనరులు కలుషితం కాకుండా ఉండేందుకు నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ, జంట జలాశయాల చుట్టూ ఉన్న గ్రామాల వల్ల నీటి వనరులు కలుషితం అవుతున్నాయి. దీని నివారణ చర్యల కోసం ప్రభు త్వం నిపుణుల కమిటీని మరో అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. 1995లో నిపుణుల కమిటీ ఇచ్చిన రెండో నివేదిక ప్రకారం, 8.3.1996న అప్పటి ప్రభుత్వం జీవో 111 ను జారీ చేసింది. పరీవాహక ప్రాంతాల నుం చి డౌన్స్ట్రీమ్లోకి వరద నీరు వచ్చే క్రమంలో కలుషితం కాకుండా ఉండేందుకు జంట జలాశయాల ఎఫ్టీఎల్ చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 84 గ్రామాల్లో నిర్మాణాలపై ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధించింది. ఈ జీవో అమలు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఇప్పటికీ ఈ అంశం కోర్టు పరిధిలోనే ఉన్నది.
2007లో కఠిన నిబంధనలు అమలు
గత ప్రభుత్వాలు అన్నిరకాల చర్యలు తీసుకున్నప్పటికీ జలాశయాల్లో నీరు కలుషితమవుతూనే ఉన్నది. జలాశయ పరీవాహక ప్రాంతా ల్లో నిర్మాణాలు కూడా ఊపందుకొన్నాయి. దీంతో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, జలాశయాల ఉనికే ప్రశ్నార్ధకం అవుతుందనుకొన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 29.11.2005న జీవో 952 ప్రకారం ఒక కమిటీని నియమించింది. జలమండలి, పీసీబీ, హుడా, పరిశ్రమల శాఖ అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ రెండేండ్లపాటు సుదీర్ఘ అధ్యయనం చేసింది. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ), ఎన్జీఆర్ఐ, ఐఐసీటీతో కూడా సర్కారు మరో అధ్యయనం చేయించింది. చివరకు ప్రభుత్వం నియమించిన ఈ కమిటీలు పలు కీలక సూచనలు చేశాయి. గత కమిటీలు చేసిన సూచనలతో పోలిస్తే ఈ నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. ప్రభుత్వం వాటిని 2007లో మెమో ద్వారా అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హైడ్రా, జలమండలి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అంటూ ఏవేవో రూల్స్ మాట్లాడుతున్నప్పటికీ.. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు ఇంతకంటే ఎన్నో రెట్లు కఠినంగా ఉన్నాయి.
2007 మెమోనే ప్రామాణికం.. అయితే??
ఇప్పటికీ జంట జలాశయాల పరిధుల్లో 2007 మెమో ప్రామాణికంగానే అనుమతు లు ఇస్తున్నారు. కానీ జలమండలి అధికారులు ప్రస్తుతం ఈ నిబంధనల ప్రకారం నిర్మాణాల ను గుర్తించి, హైడ్రాకు నివేదిక ఇవ్వడం లేదు. కేవలం ఎఫ్టీఎల్ పరిధిని.. అందునా కొన్ని నిర్మాణాలను మాత్రమే గుర్తించి, హైడ్రాకు ని వేదించడం అనుమానాలకు తావిస్తున్నది.
అర్థంలేని వివరణ
2007 మెమోపై ‘నమస్తే తెలంగాణ’ సంబంధిత జనరల్ మేనేజర్ డేవిడ్‌రాజును సంప్రదించగా.. మెమోలో బండ్ డౌన్‌స్ట్రీమ్ (దిగువ ప్రాంతం) అని ఉన్నదని, జలాశయాల బండ్ అంటే గేట్ల దిగువ భాగాన అని అర్థం వస్తుందని కొత్త అర్థం చెప్పారు. కానీ అదే మెమోలో బండ్‌తోపాటు ఎఫ్టీఎల్ అని కూడా ఉన్నదనే విషయాన్ని ఆయన విస్మరించారు. ఎఫ్టీఎల్కు దిగువ భాగం అంటే ఎఫ్టీఎల్ పరిధే అవుతుంది. ఇందులో కొత్తగా నిబంధనల అమలు ఏం అవసరం? సదరు అధికారి చెబుతున్నట్టు బండ్ దిగువ ప్రాంతమే అయితే మెమోలో ఎఫ్టీఎల్ దిగువ ప్రాంతం అని ఎందుకు పేర్కొంటారు? దీంతో పరీవాహక ప్రాంతం నుంచి జలాశయంలోకి వరద వచ్చే ప్రాంతాన్ని డౌన్స్ట్రీమ్గా పేర్కొన్నప్పటికీ జీఎం ఆ వాస్తవాన్ని పట్టించుకోలేదని అర్థమవుతున్నది. మరోవైపు జలాశయాల్లోకి వచ్చే వరద నీరు, జలాశయంలో ఉండే నీళ్లు కలుషితం కాకుండా ఉండేందుకే ప్రభుత్వం నియమించిన కమిటీ నిషేధిత జోన్‌ను సూచించింది. జీఎం చెబుతున్నట్టుగా బండ్ (గేట్లు బిగించిన ప్రాంతం) నుంచి దిగువ ప్రాంతంలో ఆంక్షలు అమలు చేస్తే ఎగువన ఉన్న జలాశయంలోని నీళ్లు ఎలా కలుషితం కాకుండా ఉంటాయి? బండ్ దిగువన వచ్చే నీళ్లు ఎలాగూ మూసీలోకి వెళ్తాయి. ఆ నీళ్లు కలుషితమైతే జంట జలాశయాల్లోని నిల్వలపై ఎలాంటి ప్రభావం ఉండదు కదా.
2007 మెమోలో కఠిన నిబంధనలు ఇవి..