సిటీబ్యూరో, మార్చి 5(నమస్తే తెలంగాణ): ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న భారతీయులను క్షేమంగా రప్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతే తప్ప, సహాయం చేస్తున్నట్టు కాదని ప్రముఖ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఇరాక్, కువైట్ యుద్ధ సమయంలో అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం 1.70 లక్షల మంది భారతీయులను తరలించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్నట్టుగా అప్పటి సర్కారు గొప్పలు చెప్పుకోలేదని, ప్రచారం చేసుకోలేదని చెప్పారు. శనివారం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మినీ ఆడిటోరియంలో సార్వత్రిక సామాజిక వేదిక ఆధ్వర్యంలో ‘ఓపెన్ టాక్’ నిర్వహించారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ‘ఉక్రెయిన్ పరిణామాలు-పర్యవసనాలు’ అనే అంశంపై పొఫెసర్ నాగేశ్వర్ ప్రసంగించారు. ఉక్రెయిన్ నుంచి వందల మందిని తరలించి కోట్లల్లో ట్వీట్లు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘గతంలో సోషల్ మీడియా లేదు. పత్రికలు, టీవీ మాధ్యమాలు ఉన్నా ఈ స్థాయి ప్రచార యావ అప్పటి నాయకులకు లేదు’ అని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు ఫొటోలకు ఫోజులే ఫస్టు
‘2011లో లిబియా నుంచి భారతీయులను తరలించారు. ప్రపంచంలో మరే ఇతర దేశానికి చెందిన నౌకలను అప్పుడు లిబియా పోర్టులోకి అనుమతించలేదు. అప్పటి భారత ప్రభుత్వం గడాఫీతో మాట్లాడి మన ఇండియన్ జలపుష్ప, ఐఎన్ఎస్ ఆదిత్య, ఐఎన్ఎస్ మైసూర్ వంటి నౌకలతో పాటు విమానాలు కూడా వెళ్లి భారతీయులను తరలించాయి’ అని నాగేశ్వర్ అన్నారు. ‘లిబియాలో భారతీయుల తరలింపు జరుగుతున్న సమయంలో ఇండియన్ ఎంబసీలో మురుగేశన్ అధికారిగా ఉన్నపుడు అక్కడికి మీడియా వెళ్లింది. ఆయన వెంటనే.. మీకు ఇక్కడేం పని, వేలాది మందిని తరలించే పని ఉంది అని మీడియాను ప్రశ్నించారు. ఇప్పుడైతే తరలింపును పక్కన పెట్టి మీడియాకు ఇంటర్వ్యూలు, ఫొటోలకు ఫోజులు ఇచ్చే పరిస్థితి ఉంది’ అని వ్యంగ్యంగా అన్నారు.
ముందుగా తరలిస్తే బాగుండేది
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం ముందుగా ప్రారంభిస్తే బాగుండేదని నాగేశ్వర్ అన్నారు. యుద్ధంపై భారత్ తటస్థ వైఖరి సరికాదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
బలహీనులే సమిదలు: ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
ఆనాటి నుంచి నేటి ఆధునిక యుగంలో కూడా బలిసిన వాళ్ల యుద్ధ రంగంలో బలహీనులు సమిదలవుతున్నారని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. యుద్ధాలు జరిగినప్పుడు ఒకప్పటి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకున్నాయని, ఇప్పుడు యుద్ధం ప్రారంభమైన ఐదు రోజులకు గానీ ప్రభుత్వం మేలుకోలేదని అన్నారు. ఇది కేంద్రంలో ఉన్న ప్రభుత్వ మొద్దు నిద్రకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ చెన్నబసవయ్య, టీ-శాట్ సీఈవో శైలేష్‌రెడ్డి, తదితరులు ప్రసంగించారు.