హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వదులుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు తీసుకురావాలి కానీ ప్రజలు వ్యతిరేకించే పని అభివృద్ది కాదని పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్(Haragopal) అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం(Mylaram village) గ్రామంలో మైనింగ్‌కు(Mining) వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న ఉద్యమానికి హరగోపాల్ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అక్రమంగా అరెస్ట్ చేశారు. అనంతరం హరగోపాల్ మాట్లాడుతూ.. మైలారం గుట్టల్లో విలువైన ఖనిజాల కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అనుమతివ్వడం సరైంది కాదన్నారు.
ప్రభుత్వ అనుమతులను ప్రజలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. గుట్టల విధ్వంసంతో స్థానిక ప్రజలు ఉపాధి కోల్పోవడంతో పాటు పర్యావరణ సమస్యలు ఏర్పడుతాయన్నారు. ప్రజలు వద్దనుకున్న అభివృద్ధిని ప్రభుత్వం చేపట్టడం అప్రజాస్వామికమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అనుమతులు రద్దు చేసి పునః సమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రతిపక్షాలకు వారధిలా ఉన్న హరగోపాల్(Professor Haragopal )వంటి వ్యక్తులను అరెస్ట్ చేయడాన్ని యావత్ ప్రజానీకం ఖండిస్తున్నది.