OU | ఉస్మానియా యూనివర్సిటీ: ప్రజాస్వామ్య గొంతుక ఉస్మానియా యూనివర్సిటీపై నిర్బంధం విధించడం ఎవరివల్లనూ కాదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. తక్షణమే సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూలో ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాలలోని పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలు భావ సంఘర్షణకు నిలయాలుగా ఉండాలని అన్నారు. యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించకుండా నిరోధిస్తూ సర్క్యులర్ జారీ చేసి ఆంక్షలు విధించమంటే సమాజాభివృద్ధిని అడ్డుకోవడమేనని అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తమ న్యాయమైన ఆకాంక్షలను చెప్పుకోవడానికి ఒక ప్రజాస్వామ్య వేదిక ఉండాలని ఆకాంక్షించారు. అలాంటప్పుడే యూనివర్సిటీలు సమాజాభివృద్ధికి మార్గదర్శకం అవుతాయని ఆ వైపు కృషి చేయాల్సిన అవసరం పాలకవర్గాలపై ఉన్నదని వివరించారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ యాజమాన్యం న్యాయబద్దంగా పోరాడుతున్న విద్యార్థి సంఘాలను వారి కార్యకలాపాలను అడ్డుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో యూనివర్సిటీలపై ఈ రకమైన నిర్భంధం ప్రయోగించబడుతున్నదని ఆరోపించారు. ఇటీవల కాలంలో యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులపై నిజనిర్ధారణ జరిపి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్స్, వివిధ శాఖల అధిపతులను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. తాను ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తున్నానని ప్రకటించారు. సర్క్యులర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఎస్ఎల్ పద్మ, ఎస్‌యూసీఐ రాష్ట్ర నాయకులు మురహరి, సీఎల్సీ నాయకులు నారాయణరావు, సీపీఐ నాయకులు కాంపల్లి శ్రీనివాస్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పుట్ట లక్ష్మణ్, అర్.ఎల్.మూర్తి, అనిల్, అల్లూరి విజయ్, పొడపంగి నాగరాజు, ఆనంద్ రావు, లెనిన్, నెల్లి సత్య, ఉదయ్, మంద నవీన్, రాకేష్, శ్రీను, ఆసిఫ్, సంతోష్, సాయిరాం, రాజేష్, కంచర్ల బద్రి, అవ్వారి వేణు, అశ్వన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.