 
                                                            ఖైరతాబాద్, జూలై 19: సీఎం రేవంత్‌రెడ్డిది ప్రజాపాలన కాదని, పటేల్ పాలన అని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గ్రూప్ 1లో మెయిన్‌కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటుచేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీహెచ్‌డీలు, డిగ్రీలు చేసిన నిరుద్యోగులపై సీఎం వెటకారపు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. 90 శాతం మంది ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచామన్న విషయాన్ని మరువొద్దని హితవు పలికారు. 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబసభ్యులు సుమారు కోటి మందికిపైగా ఉంటారని, వారు తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తారని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల్లో సీఎం రేవంత్‌రెడ్డి తన సామాజికవర్గం బలంతోనే గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. గ్రూప్ 1లో 1:100 ఇస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని ప్రభు త్వం చెప్తున్నదని, వందకు పైగా కేసులున్న తీన్మార్ మల్లన్న, సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేసి ప్రజాప్రతినిధులైతే రాని సమస్యలు కష్టపడి చదివిన నిరుద్యోగులకు లీగల్ సమస్యలు ఎలా వస్తాయని, కోర్టు కూడా అలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు.
ఏపీ ప్రభుత్వం గ్రూప్ 1 మెయిన్‌కు 1:100 ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు న్యాయపరమైన సమస్యలు వస్తాయో స్పష్టం చేయాలని విద్యావేత్త అశోక్ డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో ప్రభుత్వ వైఖరి కక్షపూరితంగా ఉన్నదని సేవాలాల్ సేన అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందని, నిరుద్యోగులకు మాత్రం చేయిచ్చారని తెలంగాణ విఠల్ విమర్శించారు. కాంగ్రెస్ ఏడునెలల పాలన ఏడ్చినట్టే ఉన్నదని, ఒకప్పుడు కార్యకర్తలేని కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులే కార్యకర్తలై గెలిపించుకున్నారని, అలాంటి వారిని నేడు నిర్బంధిస్తున్నారని తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులు గోసపడుతుంటే కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్న ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కోదండరాం వారికి సమాధానం చెప్పాలని వక్తలు డిమాండ్ చేశారు. అనంతరం నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
 
                            