జగిత్యాల, జూన్ 4 (నమస్తే తెలంగాణ): గవర్నర్ ఆఫీస్, ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువులు ఇప్పిస్తానని, తాను జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తానని పలువురిని బురిడీ కొట్టించి డబ్బులు దండుకుంటున్న ఘరానా మోసగాడి బాగోతం జగిత్యాలలో వెలుగుచూసింది. పెద్దపల్లికి చెందిన బాధితురాలు పిడుగు సరిత, ఆమె కొడుకు రాకేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటకు చెందిన పిడుగు సరిత మహిళా సంఘాల్లో చిన్న ఉద్యోగిగా,. ఆమె భర్త లక్ష్మణ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరి కొడుకు రాకేశ్ మంథని జేఎన్టీయూలో డిప్లొమా పూర్తిచేశాడు. సరిత చెల్లెలు, మరిది జగిత్యాలలోని విద్యానగర్‌లో నివాసముంటున్నారు. చుట్టపుచూపుగా చెల్లెలు ఇంటికి వచ్చిన సరిత, ఇంటిపై భాగంలో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తి వద్దకు యువకులు పెద్ద సంఖ్యలో రావడం గమనించింది. ఈ క్రమంలో చెల్లెలు మామతో కలిసి పైభాగంలో అద్దెకు ఉంటున్న వ్యక్తి వద్దకు వెళ్లి మాట్లాడగా.. తన పేరు దూడపాక తిరుపతిరావు అని, జగిత్యాల కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తానని పరిచయం చేసుకున్నాడు.
విద్యాశాఖలో మూడు జిల్లాలకు తానే హెడ్డునని నమ్మబలికాడు. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, జిల్లాల కలెక్టర్లందరూ పరిచయస్తులేనని, కావాలంటే వారితో దిగిన ఫొటోలు చూడండి అని బురిడీ కొట్టించాడు. నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు పెట్టిస్తానని, తనకు ఓ ఏజెన్సీ ఉందని అందుకే యువకులు వస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో తన కొడుకు రాకేశ్‌కు ఉద్యోగం పెట్టించాలని సరిత కోరింది. సరేనన్న తిరుపతిరావు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సెక్రటరీగా పనిచేసేవ్యక్తి తనకు దగ్గరివాడని, గవర్నర్ ఆఫీస్‌లో ఉద్యోగం పెట్టిస్తానని పేర్కొన్నాడు. ఈ మేరకు రాకేశ్ పేరుతో ఏకంగా గవర్నర్‌కు ఉద్యోగం కోసం తెల్ల కాగితంపై రెజ్యూమ్‌ను తయారు చేశాడు. దానిపై గవర్నర్ సెక్రటరీ సంతకం, గవర్నర్ కార్యాలయం ముద్రలు వినియోగించాడు. గవర్నర్ కార్యాలయంలో ఉద్యోగం కోసం రూ.2లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో అంత చెల్లించలేనని సరిత పేర్కొనడంతో దాన్ని నిలిపివేశాడు. సరిత తన కొడుక్కు ఎలాగైనా ఉద్యోగం ఇప్పించాలని తిరుపతిరావును వేడుకోగా, హైదరాబాద్‌లోని జీకే ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే కంపెనీలో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తానని పేర్కొన్నాడు.
సరిత,రాకేశ్‌ను హైదరాబాద్‌కు తీసుకువెళ్లి జీకే ఫైనాన్షియల్ సర్వీసెస్ పేరిట ఉన్న కంపెనీలో పరీక్ష రాయించాడు. తదుపరి రూ.25వేల వేతనంతో డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం కంపెనీ ఇచ్చినట్టు అపాయింట్మెంట్ లెటర్ రాకేశ్‌కు అందజేశాడు. అదే సమయంలో ప్రభుత్వ ఆఫీస్‌లో అటెండర్ పోస్టులు ఉన్నాయని, ఒక్క రోజులో భర్తీ అవుతున్నాయని, రూ.లక్ష ఇస్తే ఉద్యోగం వస్తుందని సరితకు చెప్పడంతో, ఆమె తనకు సమీప బంధువు, దివ్యాంగుడైన దుబ్బ గట్టయ్యకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయగా ఆయన రూ.80వేలను ఫోన్‌పే ద్వారా తిరుపతిరావుకు చెల్లించాడు. రెండు రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వస్తానని చెప్పిన తిరుపతిరావు, తర్వాత పత్తా లేకుండాపోయాడు. ఇరవై రోజుల క్రితం పెద్దపల్లి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా తిరుపతిరావు ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని, ఫిర్యాదు చేయవద్దని బతిమాలాడి.. దుబ్బ గట్టయ్య పేరిట చెక్ ఇచ్చాడని సరిత తెలిపింది. చెక్కు తీసుకుని బ్యాంకుకు వెళ్తే అకౌంట్లో డబ్బులు లేవని అధికారులు చెప్పారని పేర్కొంది.
దీంతో తిరుపతిరావుకు ఫోన్ చేయగా .. ‘డబ్బులు లేవు, ఏం చేసుకుంటావో చేసుకో’..? అంటూ బెదిరిస్తున్నాడంటూ సరిత వాపోయింది. బుధవారం తిరుపతిరావు గురించి వాకబు చేసేందుకు జగిత్యాల కలెక్టరేట్‌కు సరిత తన కొడుకుతో కలిసి వచ్చింది. తిరుపతిరావు అనే ఉద్యోగి కలెక్టరేట్లో ఎవరూ లేరని పేర్కొనడంతో కన్నీటి పర్యంతంకాగా, అధికారులు ఆమెను ఓదార్చారు. నమ్మించి మోసం చేశాడని, కలెక్టర్ వద్దకు ఎందరో వస్తుంటారని, అలాంటి ఫొటోలను చూసి మోసపోవద్దని పేర్కొన్నారు. తిరుపతిరావు చేసిన మోసంపై కలెక్టర్‌తో పాటు, ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.