శనివారం 06 జూన్ 2020
Telangana - May 14, 2020 , 01:48:11

ప్రైవేటీకరణ.. ఓ విఫల ప్రయోగం!

ప్రైవేటీకరణ.. ఓ విఫల ప్రయోగం!

  • ఒడిశాలో చేతులెత్తేసిన సంస్థలు
  • ప్రభుత్వానికి వేల కోట్ల బకాయిలు
  • పలు రాష్ర్టాల్లో ఫ్రాంచైజీలూ ఫెయిల్‌
  • నిర్వహణ పట్టని ప్రైవేటు సంస్థలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం-2020 బిల్లు సబ్‌లైసెన్సింగ్‌, ఫ్రాంచైజీల ద్వారా డిస్కంలను ప్రైవేటీకరించాలని సూచిస్తున్నదని, గతంలో జరిగిన ఇటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజలకు అత్యవసర సేవలందించే సంస్థలు ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిదని, ప్రైవేటు సంస్థలు లాభాలను ఆర్జించి, నష్టాలు రాగానే చేతులెత్తేస్తాయని హెచ్చరిస్తున్నారు. 

ప్రయోగాలు.. విఫలం..

గతంలో పలు రాష్ర్టాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ (డిస్కంలను) ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరిగాయి. రెండు దశాబ్దాలకు ముందే.. 1999లో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని మొత్తం నాలుగు డిస్కంలను ప్రైవేటుపరం చేసింది. ఒక డిస్కంను అమెరికల్‌ ఎలక్ట్రిసిటీ సైప్లె కార్పొరేషన్‌ (ఏఈఎస్‌), మరో మూడు సంస్థలను రిలయెన్స్‌కు చెందిన బీఎస్‌ఈఎస్‌ తీసుకున్నాయి. ఈ కంపెనీలు లాభార్జనపైనే దృష్టి పెట్టి, డిస్కంల నిర్వహణను గాలికొదిలేశాయి. దీంతో నష్టాలు రావడంలో ఏఈఎస్‌ సంస్థ కేవలం రెండు సంవత్సరాలకే చేతులెత్తేసింది. డిస్కంను నడపడం తనవల్లకాదంటూ తప్పుకుంది. దీనితో 2001లో ప్రభుత్వం టేకోవర్‌ చేసింది. అప్పటికే ఏఈఎస్‌ కంపెనీ ఒరిస్సా ట్రాన్స్‌కోకు సుమారు రూ. 600 కోట్లు బకాయిపడింది. ఉద్యోగులు, కార్మికులకు పీఎఫ్‌ బకాయిలను, పింఛన్‌ను కూడా చెల్లించలేదు. 

మిగిలిన మూడు డిస్కంలను చేపట్టిన బీఎస్‌ఈఎస్‌ కూడా ఇదే బాటలో నడిచింది. సరైన నిర్వహణ, పనితీరును కనపరచకపోవడంతో విద్యుత్‌ నియంత్రణ సంస్థ (ఈఆర్సీ) 2005లో నోటీసులు జారీచేసింది. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు కూడా బీఎస్‌ఈఎస్‌ ఎటువంటి పెట్టుబడులూ పెట్టలేదు. విద్యుత్‌ కొనుగోలు చార్జీలు చెల్లించకుండా బకాయిపడింది. దీంతో ఈఆర్సీ మరోమారు 2013లో నోటీసులిచ్చింది. అనంతరం 2015లో బీఎస్‌ఈఎస్‌ నుంచి మూడు డిస్కంలను ఒడిశా ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. దాదాపు 15 ఏండ్లలో నాలుగు డిస్కంలు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.4462 కోట్లు బకాయి పడటం గమనార్హం. 

పెట్టుబడులేవీ?

ప్రైవేటు సంస్థలు తమకప్పగించిన వ్యవస్థలను బలోపేతానికి పెట్టుబడులు పెట్టకుండా కేవలం లాభార్జనపై దృష్టిపెట్టడం వల్లనే ఆ ప్రయోగాలు విఫలమయ్యాయని విద్యుత్‌రంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నో వేల కోట్లు వెచ్చించి, సకల సదుపాయాలతో డిస్కంలను అభివృద్ధిచేసి ప్రైవేటుసంస్థలకు అప్పగిస్తే అవి నిర్వహణను అటకెక్కించి లాభార్జనపైనే దృష్టి పెడుతున్నాయి. దీంతో డిస్కంలు క్రమంగా నష్టాల బాట పట్టడంతో ప్రైవేటుసంస్థలు చేతులెత్తేస్తున్నాయి. గతంలో జరిగిన విఫల ప్రయోగాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం తాను ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్రాంచైజీలు కూడా విఫలమే

డిస్కంల ప్రైవేటీకరణ బెడిసికొట్టడంతో కొన్ని ప్రాంతాలను ఫ్రాంచైజీలుగా విభజించి ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు కొన్ని రాష్ర్టాలు ప్రయత్నించాయి. మహారాష్ట్రలో భీవండి, ఔరంగాబాద్‌, జల్గాం, ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రా, కాన్పూర్‌, మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌, సాగర్‌, ఉజ్జయిని, బీహార్‌లో భాగల్పూర్‌, ముజఫరాబాద్‌, గయ, జార్ఖండ్‌లో రాంచి, జంషెడ్‌పూర్‌ తదితర ప్రాంతాలను ఫ్రాంచైజీలకు అప్పగించారు. ఈ ఫ్రాంచైజీలు కూడా నిర్వహణను పక్కనపెట్టి లాభాలపైనే దృష్టిపెట్టాయి. దీంతో ఒక్క భీవండి మినహా అన్ని ఫ్రాంచైజీలు మళ్లీ ప్రభుత్వాలవద్దకు చేరాయి.  భీవండిలోనూ సదరు ఫ్రాంచైజీ నష్టాలనే అధికంగా చూపుతున్నది.


logo